భయానక హత్యకు యావజ్జీవ శిక్ష…

భయానక హత్యకు యావజ్జీవ శిక్ష…
- కేసముద్రం సంచలన ఘటనపై న్యాయస్థానం కఠిన తీర్పు
- అమాయకుడిని హతమార్చిన నిందితుడికి జీవిత ఖైదు
మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలంలో నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి సమగ్ర సాక్ష్యాధారాలను పరిశీలించి అంగోత్ హరీష్ అనే నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ మేరకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 30 వేల జరిమానా విధించారు. కేసు వివరాల ప్రకారం.. 2020, ఆగస్టు 23 వ తేదీ అర్థరాత్రి సమయంలో కేసముద్రం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
అనంతపురం జిల్లాకు చెందిన వెంకన్న అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని నిందితుడు దాడి చేశాడు. తర్వాత ఘోరంగా హత్య చేసి ఘటన స్థలం సమీపంలో శరీరాన్ని వదిలిపెట్టి పరారయ్యాడు. ఫిర్యాదు మేరకు అప్పటి కేసముద్రం ఎస్సై బి. సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహబూబాబాద్ రూరల్ సీఐలు జే. వెంకటరత్నం, పి. రవికుమార్ ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేశారు. తదుపరి పూర్తి వివరాలతో చార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించారు. విచారణ సమయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు కేసును ప్రత్యేకంగా పరిగణించారు.
డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో పోలీసులు సాక్ష్యాలను సమగ్రంగా సిద్ధం చేశారు. కోర్టు సీడీఓ అశోక్ రెడ్డి సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య వాదనలు వినిపించారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుతో కేసముద్రం ప్రాంత ప్రజల్లో ఊరట నెలకొన్నట్లు స్థానికులు తెలిపారు.
