HYD | చాంద్రాయ‌ణగుట్ట కూల్చివేతలు.. అక్ర‌మ నిర్మాణాల‌పై హైడ్రా కొర‌డా

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయ‌ణ‌గుట్ట నియోజకవర్గం బండ్లగూడ మండలం పరిధిలో హైడ్రా విభాగం అక్రమ కబ్జాదారులపై విరుచుకుపడింది. అక్బర్ నగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 303 నుంచి 306 వరకూ ఉన్న ప్రభుత్వ భూమిలో 2000 గజాల మేర కబ్జా చేసిన స్థలాన్ని గుర్తించిన హైడ్రా బృందం, అక్కడ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసింది. హైడ్రా దాడుల నేప‌థ్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇందులో భాగంగా, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు లేదా చెరువుల్లో చేపట్టిన నిర్మాణాలపై ఎవరైనా సమాచారమిస్తే, వాటిపై వెంటనే చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

ఉలిక్కిప‌డిన పాత‌బ‌స్తీ..
హైడ్రా చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తో పాత‌బ‌స్తీ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. చర్యలతో కబ్జా రాయుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ కూల్చి వేతలకు వ్యతిరేకంగా పలువురు ఎంఐఎం కార్పొరేటర్లు, మహిళా నాయకులు హైడ్రా అధికారులపై నిరసన చేపట్టారు. హైడ్రాకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. నిర‌స‌న చేప‌ట్టిన ఎంఐఎం నేతలు, మహిళా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply