Chandrababu | మనమే టాప్

Chandrababu | మనమే టాప్

  • అభివృద్ధి పరుగులు పెడ్తోంది
  • సంక్షేమంలో మనమే బెస్ట్
  • ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సామజిక పెన్షన్లకు ఏటా 33 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన పెదసేవలో ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో ఆర్ధిక వ్యవస్థ నిర్వీర్యమై ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని ప్రజలను కోరితే ప్రజలంతా కలిసి తమకు అంతా కలిసి అనూహ్యమైన మద్ధతు ఇచ్చారని, 164 సీట్లలో కూటమి అభ్యర్ధులను గెలిపించి మా బాధ్యతను పెంచారని, అభివృద్ధి, సంక్షేమం తోపాటు సుపరిపాలనకు నాంది పలుకుతున్నామన్నారు.

దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం : Chandrababu

దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే మన రాష్ట్రంలోనే నెలకు వృద్దులు, వితంతువులకు 4 వేల రూపాయలు, దివ్యంగులకు 6 వేల రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10 వేలు, మంచానికి పరిమితమైన వారికి 15 వేలరూపాయలు చొప్పున సామజిక పెన్షన్లు అందిస్తున్నామని, వీటిలో 59 శాతం మేర మహిళలకు అందిస్తున్నామన్నారు.

తెలంగాణలో రూ.8179 కోట్లు, కర్ణాటకలో 4712 కోట్లు, మహారాష్ట్రలో 3741 కోట్లు, తమిళనాడులో 3780 కోట్లు, ఉత్తరప్రదేశ్ లో 5120 కోట్లు, గుజరాత్ లో 1584 కోట్ల రూపాయలు ఏటా సామజిక పెన్షన్లుగా అందిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ ను కొందరు ఎగతాళి చేశారు. కానీ ప్రజల మద్దతుతో దానిని సూపర్ హిట్ చేసి చూపామన్నారు.

18 నెలల్లో ఒక్క పెన్షన్ల కోసమే రూ. 50,763 కోట్లను ఖర్చు చేశామని, ఐదేళ్లలో రూ. 1.65 లక్షల కోట్ల మేర వ్యయం చేస్తున్నామని, దేశంలో ఎవరూ ఈ స్థాయిలో సంక్షేమం ఇవ్వడం లేదన్నారు. తల్లికి వందనం కింద ప్రతీ విద్యార్ధికీ రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం తల్లుల ఖాతాలో వేశామన్నారు.

ఆడబిడ్డలు కష్టపడకుండా ఉండాలనే 3 ఉచిత గ్యాస్ సిలెండర్లను ప్రభుత్వం ఇస్తోందని, రైతులు ధాన్యం విక్రయించిన 5-6 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. స్త్రీ శక్తి ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా వెళ్లేలా సదుపాయం కల్పించామని, ఇప్పటి వరకూ 25 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు.

రూ.855 కోట్ల మేర ఆర్టీసీకి చెల్లించామన్నారు. 16,347 మందికి డీఎస్సీఇ ఉద్యోగాలు కల్పించాని, అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతీ రైతుకూ రూ.20 వేలు ఇస్తున్నామన్నారు. పంచ సూత్రాల ఆధారంగా వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణ కూడా చేపట్టిందన్నారు. ప్రతీ రైతునూ కలిసి అవగాహన కల్పిస్తున్నామన్నారు.

త్వరలోనే చింతల పూడి పూర్తి చేస్తాం

త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి చింతలపూడి, నూజివీడు మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. డిమాండ్ ఆధారిత పంటలు వేసి ఎక్కువ ప్రయోజనం పొందాలని, సమీకృత వ్యవసాయ విధానాలు అవలంబించాలన్నారు. డ్రోన్ లాంటి టెక్నాలజీలను వినియోగించి వ్యవసాయ వ్యయాన్ని తగ్గించుకోవాలని, దిగుబడులు పెరగాలన్నారు.

రూ.1.50 పైసలకే యూనిట్ చొప్పున ఆక్వా కల్చర్ కు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని, ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందేందుకు రూ.850కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు.

కొబ్బరి, కోకో, కాఫీ లాంటి పంటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రావాలలని, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని రైతులు అందిపుచ్చుకోవాలన్నారు. డిసెంబరు 3 తేదీన రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులతో చర్చించాలని నిర్ణయించామన్నారు.

20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం

2029కి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని, విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇప్పటికే 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా తెలిపామన్నారు. వీటి ద్వారా 24 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.

ఏలూరు లాంటి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కింద వీటికి చేయూత ఇస్తామన్నారు. కొల్లేరులో ఉన్న సమస్యల్ని పరిష్కరించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు.

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ చేంజర్ అవుతుందని, 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాల్లో నీటి ఎద్దడి సమస్యే ఉండదని, పంటల ప్రత్యామ్నాయం పట్ల రైతులు ఆలోచించాలన్నారు.

అభివృద్ధి పరుగులు పెడ్తోంది

విశాఖ నగరానికి గూగుల్ సంస్థ రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని, విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేశామన్నారు. అమరావతి కూడా ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తున్నామని, మొదటి దశ పనులు 2028కి పూర్తి అవుతాయన్నారు. పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం మరో 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని, గత పాలకులు ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదన్నారు.

ఐదేళ్లలో గత పాలకులు చేసిన దానికీ- కూటమి 18 నెలల పాలనకూ తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు. జనవరి లోగా రాష్ట్రంలో గుంతల రోడ్లన్నీ పూడ్చి బాగు చేసి, కొత్త రహదారులు కూడా నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్యం కాపాడేందుకు సంజీవని ప్రాజెక్టును తీసుకువస్తున్నా మన్నారు. రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

గంజాయిని అరికడ్తాం

గంజాయి పై గత పాలకులు ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. కఠినంగా వ్యవహరించలేదన్నారు. మంచి సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తు్న్నామని, తలసరి ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.58 లక్షలకు పెంచటమే లక్ష్యంగా పనిచేస్తున్నా మన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కూటమి కృషి చేస్తుందన్నారు.

ధాన్యం కొనుగోళ్లు బాగున్నాయి

ఏలూరు పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ మాట్లాడుతూ, జిల్లాలో రైతులకు సాగులో, ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్ధి దర్శినీకుడని, రాష్ట్రంలో 2047 స్వర్ణాంధ్ర సాధన చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమంన్నారు.

చింతలపూడి ఎత్తిపోతల పధకం నిర్మించాలని, ఏలూరు- జంగారెడ్డిగూడెం రోడ్డును జాతీయ రహదారి జాబితాలో చేర్చి అభివృద్ధి చేయాలని, ఏలూరు నగరపాలకసంస్థలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి విధానం ఏర్పాటుచేయాలని కోరారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని నిర్మిస్తామని, ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డును జాతీయ రహదారి జాబితాలో చేర్చి అభివృద్ధికి కృషిచేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

వ్యవసాయంలో 5వ స్థానం మనది

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి రేటులో జిల్లా 5వ స్థానంలో ఉందని, 3వ స్థానానికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని 62 వేల ఎకరాలలో సాగు చేసే లక్ష్యంలో భాగంగా 59 వేల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నామన్నారు.

సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నామని, జిల్లాలో రైతులకు 60 డ్రోన్లు అందించామన్నారు. రైతన్న మీ కోసం కార్యక్రమంలో 296 రైతుసేవ కేంద్రాల పరిధిలోని లక్షా 72 వేల 065 మంది రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం సూచించిన పంచసూత్రాలపై అవగాహన కలించామన్నారు. జిల్లాలో 2,59,688 మందికి ప్రతీ నెల 113.63 కోట్ల రూపాయలు సామజిక పెన్షన్లుగా అందిస్తున్నా మన్నారు.

భీమడోలులో గురుకుల పాఠశాల ఇవ్వండి

ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ, ఉంగుటూరు నియోజకవర్గంలో గత 18 నెలల కాలంలో 140 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేదల కాలనీల్లో మౌలిక సదుపాయాలను పి4 విధానంలో చేస్తున్నామన్నారు. నల్లజర్ల-నల్లమాడ రోడ్డు మంజూరు చేయాలనీ, గ్రీన్ ఫీల్డ్ హై వే కి ఉంగుటూరు నియోజకవర్గానికి కనెక్టివిటీ కల్పించాలని కోరారు.

ఇంటర్ కాలేజీ భవనాలు నిర్మించాలని, భీమడోలు లో గురుకుల పాఠశాల భవనాలు నిర్మించాలని కోరారు. వీటిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, ఉంగుటూరు నియోజకవర్గం అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషిచేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎంపీ మహేష్ కుమార్, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీప్రసాద్, ఎమ్మెల్యే లు పత్సమట్ల ధర్మరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, డా. కామినేని శ్రీనివాస్, ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిసిఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ప్రభృతులు ఉన్నారు.

ఈ సందర్భంగా పి 4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను అభివృద్ధి ప్రణాళికలు గురించి మార్గదర్శి లను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు వ్యవసాయం, అనుబంధ రంగాలు, సెర్ప్, పరిశ్రమల శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Eluru | కిడ్నీ బాధితురాలి ఇంటికి ..

Leave a Reply