Chandrababu Naidu | చిన్న ఆలోచనలతో అభివృద్ధికి మార్గాలు

Chandrababu Naidu | చిన్న ఆలోచనలతో అభివృద్ధికి మార్గాలు
- నిధుల్లేకుండా పథకాలు అమలు చేయొచ్చు
- రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులతో సీఎం ఇంటరాక్షన్
- పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ చొరవను అభినందించిన సీఎం
Chandrababu Naidu | అనకాపల్లి/ తాళ్లపాలెం విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో : చిన్న చిన్న ఆలోచనలు ఒక్కో సందర్భంలో అభివృద్ధికి బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chiefminister Chandrababu Naidu) అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను స్వయంగా సీఎం పరిశీలించారు. పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆలోచనతో రూపొందిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని తాళ్లపాలెం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రారంభిస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు.

రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థినులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ” విద్యార్ధుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టాం. పాఠశాలకు చక్కటి యూనిఫాంతో, పరిశుభ్రంగా చదువుకోవాలి. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ముస్తాబు కార్యక్రమం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ తరహా కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో శ్రద్ధ వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 75 లక్షల మంది విద్యార్థులు (Students) ఇంటర్ వరకూ చదువుతున్నారు. ముస్తాబు లాంటి కార్యక్రమం వల్ల వ్యక్తిగత శుభ్రతతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి. చక్కగా తలదువ్వుకోవటం, భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు రావాలని కోరుతున్నాను. తల్లితండ్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల పైనే ఆశలు పెట్టుకుంది. అందరికీ తల్లికి వందనం కింద ఆర్ధిక సాయం అందించాం. విద్యార్ధులు మెరుగైన ఫలితాలు సాధించాలనే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, భోజనం అన్నీ ఉచితంగానే ఇస్తున్నాం. జీవితంలో ఏం సాధించాలన్నా చిన్న వయస్సు నుంచే కృషి చేయాలి. విద్యార్ధులంతా రాష్ట్రానికి చెందిన ఆస్తి. విద్యార్థులు నాలెడ్జి ఎకానమీలో భాగం కావాలి. మంచి ఉపాధి, ఉద్యోగాల్లో విద్యార్థులంతా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మంది విద్యార్ధుల ఆరోగ్యాన్ని కూడా త్వరలోనే పరీక్షిస్తాం. విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉండేలా మంచి పౌష్టికాహారం ఇస్తున్నాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ (Educational Minister Lokesh) విద్య శాఖలో వినూత్నమైన సంస్కరణలు తీసుకువస్తున్నారు. ”అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.








