ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్), ఆంధ్రప్రభ : దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో కలుస్తున్న పట్టిసీమ గోదావరి జలాలకు మంత్రి నిమ్మల బుధవారం పసుపు, కుంకుమతో పాటు చీర, సారెలను సమర్పించి జల హారతి (Jala Harati) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రూ.1300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే రూ.50 వేల కోట్ల ఆదాయం లభించిందన్నారు.
2014 – 19 మధ్యకాలంలో 263 టీఎంసీలకు పైగా గోదావరి జిల్లాలో కృష్ణా డెల్టా (Krishna Delta) కు తరలించినట్లు చెప్పారు. ఇది శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ అన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 428 టీఎంసీలకు పైగా కృష్ణా డెల్టాకు తరలించామని, ఇది నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ అన్నారు. నాడు టీడీపీ హయాంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా సాగునీరందిస్తే వైసీపీ హయాంలో సరైన నిర్వహణ లేక 450 లిఫ్టులు మరుగున పడ్డాయని విమర్శించారు.
జగన్ (Jagan) ప్రభుత్వం కనీసం ప్రాజెక్టుల నిర్వహణకు, గేట్లకు గ్రీజు పెట్టడానికి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ మేనేజ్ మెంట్ ద్వారా అన్ని రిజర్వాయర్లలో పూర్తిస్థాయి నీటి నిల్వ చేయగలిగామని చెప్పారు. శ్రీశైలం, ధవళేశ్వరం మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.350 కోట్లు నిధులు కేటాయించి శ్రీశైలం గేట్ల ద్వారా వరద నీరు విడుదల చేశామని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థకు మోడీ సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆక్సిజన్ ఇచ్చి ఊపిరి పోస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.