Champions Trophy | భారత్ – పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ కు వేళాయే !
- దుబాయ్ వేదికగా పాక్‌తో తలపడనున్న భారత్
- మొదటి మ్యాచ్ విజయంతో జోష్‌లో టీమిండియా
- ఓపెనింగ్ మ్యాచ్‌లోనే ఓటమితో డీలాపడ్డ పాకిస్థాన్
స్పోర్ట్స్ డెస్క్, ఆంధ్రప్రభ : చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్ – పాకిస్తాన్ మధ్య జరగనున్న హై ఓల్టేజీ మ్యాచ్.. మరికాసేపట్లో ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు దుబాయ్ వేదికగా మారింది. ఇదిలా ఉండగా మరికొద్ది సేపట్లో టాస్ పడనుంది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ సేన హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.
తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై గెలిచిన భారత్.. విజయోత్సాహంతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు చేరుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది.
మరోవైపు ఈ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పై ఓటమిని చవి చూసింది. దీంతో టీమిండియాతో జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు డూ ఆర్ డై మ్యాచుగా మారిపోయింది. పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్ ఎలగైనా గెలిచి సెమీస్ రేసులో ఉండాలని భావిస్తోంది.
అయితే, ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోతే ఈ మెగా టోర్నీ నుంచి పాకిస్థాన్ ఇంటిముఖం పట్టనుంది. మరోవైపు ఈ మ్యాచులో గెలిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారడంతో… నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఈ మ్యాచ్‌పైనే ఉంది.
భాతర్ – పాక్ జట్ల మధ్య ఓవరాల్ వన్డే రికార్డ్ !
అయితే, 2010 నుంచి చూస్తే.. ఇరు జట్ల మధ్య 17 వన్డేలు జరగగా, భారత్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే ఓవరాల్ వన్డే రికార్డును చూస్తుంటే పాకిస్థాన్ దే పైచేయి కనిపిస్తోంది.
ఇరు జట్ల మధ్య 135 వన్డేలు జరగగా, పాకిస్థాన్ 73 వన్డేలు, భారత్ 57 వన్డేలు గెలిచాయి. ఇక ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా రెండుసార్లు, పాకిస్థాన్ మూడుసార్లు గెలిచాయి.
దీంతో నేటి మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ఆసక్తికరమైన పోరు కోసం క్రికెట్ క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మార్పుల్లేకుండా రణరంగంలోకి..
గత మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో గిల్ తన ఫామ్‌ను చాటి చెప్పగా, రోహిత్ శర్మ అందించే శుభారంభాలు జట్టును ముందంజలో నిలుపుతున్నాయి.
విరాట్ కోహ్లి మాత్రమే కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. ఇంకా తనదైన స్థాయి ఆటను విరాట్ ప్రదర్శించలేదు. దాని కోసం ఇంతకంటే మంచి వేదిక ఉండదు. రాహుల్ బంగ్లాతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం.
పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం రాకుండానే మన జట్టు గత మ్యాచ్‌ను ముగించింది. అక్షర్ బ్యాటింగ్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ మరోసారి నమ్మకం ఉంచుతోంది. బౌలింగ్‌లో షమీ అద్భుత పునరాగమనం భారత్ బలాన్ని ఒక్కసారిగా పెంచింది. బంగ్లాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో అతను తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. షమీకి తోడుగా హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు.
జట్టులో మార్పు చేయాల్సి వస్తే కుల్దీప్ ప్లేస్ లో వరుణ్ చక్రవర్తి రావచ్చు.ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్ / వరుణ్, అక్షర్, జడేజాలను ఎదుర్కొని పాక్ బ్యాటర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. మొత్తంగా టీమిండియా ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన చేస్తే తిరుగుండకపోవచ్చు.
పాక్ జట్టులో కీలక మార్పులు..
ఈ టోర్నీలో కివీస్ తో తొలి మ్యాచ్ ఆడిన పాకిస్తాన్ పలు మార్పులతో భారత్ తో మ్యాచ్ ఆడబోతోంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ స్ధానంలో ఇమాముల్ హక్ జట్టులోకి రావడం ఖాయమైంది. దీంతో బాబర్ ఆజమ్ తో కలిసి అతను జట్టు ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఆ తర్వాత సాద్ షకీల్, కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ ఆడబోతున్నారు.
ప్రత్యక్ష ప్రసార వివరాలు
ఈరోజు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైవోల్టేజ్ మ్యాచ్ కోట్లాది మంది ఈ మ్యాచ్ చూడనున్నారు. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో ఈ మ్యాచ్ వీక్షించవచ్చు. జియో హాట్‌స్టార్ యాప్‌లోనూ చూడొచ్చు.