Challapalli Ps Accident : పేలుడు కాదు…Andhra Prabha Latest News.

Challapalli Ps Accident : పేలుడు కాదు…Andhra Prabha Latest News.
జస్ట్ ప్రమాదం
కృష్ణాజిల్లా ఎస్వి వివరణ
చల్లపల్లిలో టెన్షన్ టెన్షన్
ఐదుగురు క్షతగాత్రులు
ముగ్గురికి తీవ్రగాయాలు
ఇద్దరి స్థితి విషమం
చలించిన ప్రభుత్వం
కదలిన యంత్రాంగం
హోం మంత్రి ఆరా
ఇన్ చార్జి మంత్రి దిగ్బ్రాంతి
(ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో):

Challapalli Ps Accident : ఏపీలో తీవ్ర సంచలనం రేపిన కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పేలుడు ఘటనపై ప్రభుత్వం చలించిపోయింది. తీవ్రంగా గాయపడిన పోలీసులను కాపాడే బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. మెరుగైన వైద్య సాయం అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. కృష్ఱా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చల్లపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు.

పరిస్థితిని సమీక్షించారు. స్వాధీనం చేసుకున్న టాపాసులను తరలించే క్రమంలో పేలుడు సంభవించిందని తేల్చి చెప్పారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో టపానులు పేలిన ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావటంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులను పరామర్శించారు.

కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాకు శరీరమంతా గాయాలు కావటంతో చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నాగరాజుకు కంటి మీద గాయాలయ్యాయి. వారిని ఎస్సీ పరామర్శించిన అనంతరం వెంటనే విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. పేలుడు ధాటికి అబుల్లాకు శరీరంలోకి గాజు ముక్కలు చేరటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. చల్లపల్లి ఎస్ఐ దుర్గాంజనేయులకు కాళ్లకు, శరీరంలో పేలుడు ధాటికి గాజు ముక్కలు దిగటంతో చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. హెడ్ కానిస్టేబుల్ నాగరాజు చెవి వద్ద గాయం కాగా, కానిస్టేబుల్ పార్వతీకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఛల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Challapalli Ps Accident : ఇది ప్రమాదమే

గతేడాది అక్టోబరు నెలలో అక్రమంగా టపాసులు నిల్వ ఉంచిన వారి దగ్గర నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నామని, వాటిని మంగళవారం కోర్టులో సబ్మిట్ చేయటానికి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసిన క్రమంలో పేలినట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మంగళవారం చల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలి ఐదుగురికి గాయాలు కావటంతో సంఘటనా ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీజ్ చేసిన టపాసులను కోర్టులో సబ్మిట్ చేసే క్రమంలో కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఎస్ఐ దుర్గాంజనేయులుకు స్వల్ప గాయాలు కాగా, ముగ్గురిని విజయవాడ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ పార్వతీ, హెడ్ కానిస్టేబుల్ తేజ చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్ కు దూరంగా ఉంచటం జరిగిందని, కోర్టు ఆర్డర్స్ రావటంతో వాటిని కోర్టులో సబ్మిట్ చేయటానికి తీసిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాదమికంగా నిర్ధారించటం జరిగిందన్నారు. రాష్ట్ర హోం మంత్రి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత లు తీసుకుంటామని తెలిపారు.
Challapalli Ps Accident : హోం మంత్రి ఆరా

కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, వెంటనే స్పందించిన మంత్రి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎస్ఐ దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా సహా ఇతర సిబ్బందికి తక్షణం మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులను సూచించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర నివేదికను సేకరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
Challapalli Ps Accident : ఇంచార్జి మంత్రి దిగ్బ్రాంతి

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన టపాసులు పేలిన ఘటనపై ఇంచార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన టపాసుల పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బంది, సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలను తక్షణమే తెలుసుకుని పూర్తి స్థాయి విచారణ జరపాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్లలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సీజ్ చేసిన పేలుడు పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిపై సమీక్షించారు. ప్రమాదానికి గురైన ప్రాంగణంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రజల్లో ఎలాంటి భయం అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని స్పష్టం చేశారు.
