గోపేపల్లిలో భూముల గండం గట్టెక్కింది!

గోపేపల్లిలో భూముల గండం గట్టెక్కింది!
చుక్కల భూములకు ముగింపు..
125 రైతులకు NOCల జారీ
గ్రామం 80% భూములకు భరోసా 169 ఎకరాలు 305.68 సెంట్లకు హక్కుల పత్రాలు సిద్ధం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామ రైతులను ఏళ్లుగా వేధిస్తున్న కుక్కల భూముల సమస్యకు ఎట్టకేలకు శుభవార్త అందింది. గ్రామంలోని సుమారు 80 శాతం భూములు చుక్కల భూమి కిందకు వెళ్లిన నేపథ్యంలో, భూ హక్కుల చిక్కులు, రుణాల ఆటంకాలు, సాగు భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి జిల్లా యంత్రాంగం చెక్ పెట్టింది. ఇప్పటికే 6 సర్వే సంఖ్యలకు చెందిన పట్టాదారులకు సర్టిఫైడ్ 1బి, పాస్‌పుస్తకాలు అందజేయగా, మిగిలిన భూములపై కూడా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి రికార్డులను వేగంగా పరిశీలించారు.
తహసీల్దార్ నల్లమాడ పంపిన నివేదికపై జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ చొరవతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంగా పనిచేసి భూ రికార్డులు, వారసత్వ హక్కులు, పాత పత్రాలను క్షుణ్ణంగా ధృవీకరించాయి. దీంతో 125 మంది రైతులకు చెందిన 169 ఎకరాలు 305.68 సెంట్ల భూమిని చుక్కల భూమిగా తొలగించి పూర్తి హక్కుల పత్రాలు సిద్ధం చేశారు. ఈ రోజు (01-04-2026) నుంచే NOC పత్రాలు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ NOCలతో రైతులు బ్యాంకు రుణాలు, పంట రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి సులభంగా పొందగలరని, సాగుకు కొత్త ఊపిరి అందుతుందని అధికారులు తెలిపారు.
రైతాంగానికి భారీ ఊరట….
ఏళ్లుగా భూమి పత్రాల కోసం ఎదురు చూసిన గోపేపల్లి రైతులకు ఇది నిజమైన ఉపశమనం. భూమిపై హక్కు స్పష్టత రావడంతో రుణాలు, పంట పెట్టుబడులు, భవిష్యత్ వారసత్వ బదిలీలు ఇక సులభం కానున్నాయి. ఇది కేవలం పత్రాల జారీ మాత్రమే కాదు…గోపేపల్లి రైతుల భవిష్యత్తుకు జిల్లా యంత్రాంగం ఇచ్చిన భరోసా పత్రం. ఇందుకు సహకరించిన జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో సువర్ణ, తాసిల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి తదితరులకు రైతులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
