రంజాన్ తోఫాలతో ముస్లింలకు ఆనందం..

రంజాన్ తోఫాలతో ముస్లింలకు ఆనందం..
30వ డివిజన్‌లో తోఫా కిట్ల పంపిణీ
నియోజకవర్గంలో 15 వేల మందికి లక్ష్యం
మైనారిటీలకు అండగా నిలుస్తున్నామన్న బోండా రవితేజ
పాయకాపురం, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆనందాన్ని పంచేందుకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం నగరంలో నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ రామకృష్ణాపురం ముస్లిమ్స్ బజార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం కుటుంబాలకు తోఫా కిట్లను అందజేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.
నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ కుటుంబాలకు సుమారు 15 వేల మందికి పైగా రంజాన్ తోఫాలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ, బొండా ఉమామహేశ్వరరావు ఎప్పటికప్పుడు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ ప్రతి వర్గానికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. పేదల సహాయం, మైనారిటీల ప్రోత్సాహం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు, తోఫా పంపిణీ కార్యక్రమాలను నియోజకవర్గం అంతటా విస్తృతంగా నిర్వహించడం బొండా ఉమా ప్రజలపై ఉన్న మమకారానికి నిదర్శనమని తెలిపారు.

గతంలోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రంజాన్ మాసం ఉపవాసం, త్యాగం, సేవ భావనకు ప్రతీక అని, ఈ కాలంలో ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని రవితేజ పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌహార్దత పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
