MLC Kodandaram : తెలంగాణకు కేంద్రం అన్యాయం
తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కోదండరాం మండిపడ్డారు. కృష్ణా జలాలపై తెలంగాణ- ఏపీ మధ్య జరుగుతున్న చర్చలు.. దానిపై కేంద్రం స్పందనపై ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమానికి మూల కారణాలైన వాటిలో నీళ్ళ పంపకం ఒకటి అన్నారు.
కృష్ణా జలాల నీటి వివాదంపై గత పదేళ్ళు అధికారంలో ఉండి కూడా మాట మాట్లాడకుండా ఉన్న బీఆర్ఎస్ నేతలు.. ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి తాము పోరాటం చేస్తామని ముందుకు రావడం హాస్యాస్పదమన్నారు. గత పదేళ్లలో మీరు మౌనం వహించడం వల్లే.. ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, టీజేఎస్ తరపున గట్టిగానే నిలదీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీజేఎస్ మద్ధతు కోరిందని కోదండరాం మీడియాకు తెలియజేశారు.