CC camera | 10 రోజుల్లో చోరీ కేసు ఛేదన… .

CC camera | 10 రోజుల్లో చోరీ కేసు ఛేదన… .

  • ఇద్దరు నిందితులు అరెస్ట్…
  • బంగారు నగలు, స్కూటీ స్వాధీనం…
  • పోలీసుల పనితీరుకు ప్రశంసలు…

CC camera | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న చోరీ కేసును పోలీసులు కేవలం పది రోజుల్లోనే ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం విశేషంగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి బంగారు నగలు, వాహనం స్వాధీనం చేసుకోవడం పోలీసుల చురుకుదనాన్ని చాటిచెప్పింది. గత నెల 29వ తేదీన సంతోష్ నగర్ పరిధిలోని విజయలక్ష్మి నగర్‌లో నివసిస్తున్న లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లో దొంగతనం జరిగింది.

ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయంలో నిందితులు ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలను అపహరించారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల జాడను అన్వేషించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా దృశ్యాలు, సమాచార సేకరణ ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన రఘు, శివ సింగ్ అనే ఇద్దరు నిందితులను గుర్తించారు.

CC camera |

పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, వారు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. నిందితుల వద్ద నుంచి సుమారు 7 తులాల బంగారు నగలు, వారు నేరానికి వినియోగించిన టీవీఎస్ స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయస్థానానికి హాజరు పరచగా, రిమాండ్‌కు తరలించారు.

CC camera |

ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్ మురళీధర్‌లకు స్థానిక సీఐ విక్రమ్ సింగ్ నగదు బహుమతి అందజేశారు. అలాగే ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇన్‌చార్జిగా పనిచేసిన ఎస్సై చంద్రశేఖర్ రెడ్డికి రివార్డు మంజూరు చేయాలంటూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. నగరంలో పెరుగుతున్న చోరీ ఘటనలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

CC camera |

Leave a Reply