త‌న‌య‌కు తండ్రి ఇచ్చిన షాక్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అంద‌రూ ఊహించిన‌ట్టే ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై వేటు ప‌డింది. త‌న‌య క‌విత‌కు తండ్రి కేసీఆర్ షాక్ ఇచ్చారు. క‌విత తీరుపై కేసీఆర్ మండిప‌డ్డారు. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ‌ జ‌న‌జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత (kalvakuntla kavitha)ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకుంది.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల‌ ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి(BRS Party) నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్(suspended) చేస్తూ పార్టీ అధ్యక్షులు కే. చంద్రశేఖర్ రావు(K. Chandrasekhar Rao) నిర్ణయం తీసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.

కాళేశ్వరం(Kaleshwaram) కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ(State Government, CBI) ఎంక్వయిరీ వేయడంపై నిన్న కవిత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు మరక అంటించడంలో హరీశ్‌ రావు, సంతోష్‌ల అవినీతే ప్రధాన కారణమని ఆరోపించిన సంగ‌తి విదిత‌మే. వీరిద్దరి వెనుక ఉండి కుట్రలు చేస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. అయితే త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని క‌విత ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

మమ్మల్ని లాగడం సరికాదు: మంత్రి అడ్లూరి
కాళేశ్వరం(Kaleswaram) అవినీతిపై ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman) స్పందించారు. అవి కుటుంబ తగాదాలని, ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha)నే చూసుకోవాలని, తమను లాగడం సరికాదని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా అంగీకరించారని తెలిపారు. తాము కక్ష్య సాధింపు చర్యలు చేయడం లేద‌ని, అయితే హరీశ్‌రావు(Harish Rao), సంతోష్‌రావు(Santhosh Rao) వెనుక ఉండాల్సిన అవసరం తమకు లేదన్నారు.


కూతురు క‌విత వ్యాఖ్య‌లే సాక్షం! బీజేపీ
కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణను దోచుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇందుకు కవిత వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. దోచుకున్నడబ్బును సరిగ్గా పంచుకోవడంలో వచ్చిన గొడవల వల్లనే కవిత ఆరోపణలు చేసిందన్నారు.

Leave a Reply