- పెనుగంచిప్రోలు దాడిపై హోంమంత్రి అనిత ఆగ్రహం
- ఘటన వివరాలపై ఉన్నతాధికారుల నుంచి ఆరా
- గాయపడిన సీఐకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
వెలగపూడి : పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరుణాలలో జరిగిన గొడవపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులపై రెచ్చిపోయి రాళ్లతో దాడిచేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు, రాళ్లు విసిరిన ఘటనలో పోలీసులకు, భక్తులకు గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనకు కారణమైన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు హోంమంత్రి ఆదేశించారు.
జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలవడంపై అతని పరిస్థితిపై ఆరా తీశారు. నందిగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించేలా చూడాలని ఆమె ఆదేశించారు. అదుపు చేసి రక్షించాలనుకున్న పోలీసులని చూడకుండా దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.