గోవుల సంరక్షణ అందరి బాధ్యత..

తొర్రూరు, ఆంధ్రప్రభ : గోవుల సంరక్షణ అందరి బాధ్యతగా మారాలని కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు పెదగాని సోమయ్య,మిత్ర బృందం ప్రతినిధి కల్లూరి నాగేంద్ర చారి లు తెలిపారు.డివిజన్ కేంద్రంలోని వేణుగోపాలస్వామి గోశాల కు తొర్రూరు ఉన్నత పాఠశాల 1984–85 టెన్త్ బ్యాచ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో రూ.60,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.పెదగాని సోమయ్య, నాగేంద్ర చారిలు మాట్లాడుతూ… తొర్రూరు ఉన్నత పాఠశాల 1984–85 టెన్త్ బ్యాచ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆపదలో ఉండే సహచర మిత్రులను ఆదుకోవడంతోపాటు సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాల పరంపర కొనసాగిస్తున్నామన్నారు. గోవుల సంరక్షణకు పాటుపడుతున్న స్థానిక గోశాలకు తోడ్పాటు అందించాలనే సంకల్పంతో ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ప్రకృతిలోని చెట్టూ చేమా, రాయీ రప్ప, పక్షులు, జంతువులు, మనకు అన్నీ పూజనీయాలే కానీ అగ్రస్థానం మాత్రం గోవుదేనన్నారు. సర్వ దేవతా స్వరూపమే గోవు అని,ముప్పయి మూడు కోట్ల దేవతలకు నిలయం గోవు శరీరం అన్నది మన నమ్మకమన్నారు.

ప్రతి ఒక్కరూ గోవులను పూజించి గోమాత ఆశీస్సులు పొందాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం సైతం గోశాలల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తంగిరాల శ్రీనివాసరావు,కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి,పెండెం రమేష్,చిట్యాల వెంకన్న, మాచర్ల శంకర్, మడిపెద్ది కొమురయ్య, పడిపెద్ది సోమయ్య, దీకొండ వెంకటయ్య, ముత్తినేని రాజమల్లు, దురుసోజు నాగేశ్వరరావు, అనుమాండ్ల కుశలవరెడ్డి, కె. వెంకటరమణ, జన్నపురెడ్డి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply