Bus accident | వాగులో పడ్డబస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Bus accident | వాగులో పడ్డబస్సు.. తప్పిన పెను ప్రమాదం..
Bus accident, ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని షాంపూర్ లో సోమవారం తెల్లవారుజామున వంతెన పై నుండి వాగులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ చిన్న వాగులో నీరు లేకపోవడం వల్ల అధిక ఎత్తు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బస్సు బోల్తా పడ్డ విషయం తెలియగానే షాంపూర్ గ్రామస్తులు వచ్చి బస్సు అద్దాలు పగలగొట్టి గాయాలైన ప్రయాణికులను బస్సు నుండి బయటకు తీశారు.
గాయాలైన వారికి 108 వాహనాలు ద్వారా ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షాంపూర్ వాగులో బస్సు ఎలా పడ్డ దాన్న విషయం కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో జరిగిందా లేక అదుపుతప్పి జరిగిందా విషయం ఇంకా తెలియలేదు. సంఘటనకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. షాంపూర్ సర్పంచ్ దీపక్ సంఘటన స్థలంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.
బోడ వంతెన వల్లే ప్రమాదం..
ఉట్నూరు మండలంలోని షాపూర్ సమీపంలోని చిన్న వాగు వంతెనకు ఇరు వైపులా అడ్డుగా కట్టడాలు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ వంతెన వద్ద ఎలాంటి సూచిక బోర్డులు లేవు. వంతెన వచ్చే వరకు కనిపించదు. ఆ వంతెన ఎక్కువ ఎత్తుగా లేకపోవడం అందులో నీరు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అధికారులు వంతెనకు ఇరువైపులా అడ్డుగా కట్టించకపోవడం అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదానికి కారణమని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆ వంతెనకు ఇరువైపులా భద్రతగా కట్టించాలని లేనిపక్షంలో ఇలాగే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ప్రజలు తెలియచేశారు.

