గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన బడ్జెట్: బీజేపీ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ ‘ఆరు గ్యారంటీలు’ను విస్మరించిన దగాకోరు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విమర్శించారు.
శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ బడ్జెట్ పేదలను నిరాశలోకి నెట్టేసిందని అన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. బడ్జెట్‌లో గల్ఫ్ బాధితులకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడం ద్రోహమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విమర్శలు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించడానికి కేవలం రూ.300 కోట్లు కూడా కేటాయించలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆరు నెలల్లో చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుత బడ్జెట్‌లో దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం జిల్లా రైతాంగాన్ని మోసం చేయడమేనని అన్నారు.
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం, నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
అలాగే ఆదిలాబాద్ విమానాశ్రయం గురించి ప్రస్తావించిన ప్రభుత్వం, సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న జక్రాన్‌పల్లి విమానాశ్రయాన్ని పట్టించుకోలేదని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ప్యాకేజీలు 21, 22 పనులకు, మంచిప్ప (మాసాని) రిజర్వాయర్‌కు కూడా నిధులు కేటాయించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందన్నారు.
ఇటీవల నిజామాబాద్ పర్యటనలో రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ, తాజా బడ్జెట్‌లో దాని ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకం, రైతు వ్యతిరేకం, యువత వ్యతిరేకమని తీవ్రంగా విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ నెల 23న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్‌కార్ లక్ష్మీనారాయణ, ఓం సింగ్ నాయక్, పుట్ట వీరేందర్, బొబ్బిలి వేణు, ఇందూర్ సుధా, గడ్డం రాజు, అంబదాస్ రావు, ఆనంద్, విజయ్ కృష్ణ, బుల్లెట్ శీను తదితరులు పాల్గొన్నారు.
