BRS MLA | స్పీకర్‌ నిర్ణయంపై హైకోర్టుకు వెళతాం

BRS MLA | స్పీకర్‌ నిర్ణయంపై హైకోర్టుకు వెళతాం


బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

BRS MLA | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రంగా తప్పుబట్టారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా స్పీకర్ తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ, ఫిరాయింపులను సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సమర్థించారని గుర్తుచేశారు. సీఎం వైఖరికి అనుగుణంగానే స్పీకర్ ఈ తీర్పు ఇచ్చారని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేపీ వివేకానంద అన్నారు.

ఫిరాయించిన ఎమ్మెల్యేలు బాహాటంగానే కాంగ్రెస్‌లో ఉన్నారని తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం పనిచేశారని చెప్పారు. కాంగ్రెస్‌ ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫొటోలు ఉన్నాయని తెలిపారు. స్పీకర్‌ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనే ఇవాళ తీర్పు ఇచ్చారని కేపీ వివేకానంద తెలిపారు.

మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలపై అడిగితే స్పీకర్‌ నుంచి సమాధానం లేదన్నారు. న్యూఇయర్‌ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించడంతో స్పీకర్‌ ఈ తీర్పును వెలువరించారని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణను పొడిగిస్తే చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించిందని గుర్తుచేశారు.

Leave a Reply