BRS | గంగపుత్రుల కోసం..

BRS | గంగపుత్రుల కోసం..

BRS, బాల్కొండ, ఆంధ్రప్రభ : కుల వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న గంగపుత్రులకు ఎలాంటి కోతలు లేకుండా మత్ససంపద పెంచి ఆర్థిక బలోపేతం కోసం కృషి చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం బాల్కొండ మండలం నాగాపూర్ శివారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో సబ్సిడీ చేప పిల్లలను వదిలారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పదేళ్లు ఉచిత చేప పిల్లలు, రొయ్యలు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాల్లో కాంగ్రెస్ కోతలు విధిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. గతంలో నియోజకవర్గంలో రూ.3.70 కోట్ల వ్యయంతో కోటి 74 లక్షల చేపపిల్లలు, 68 లక్షల రొయ్యలతో కలిపి 10 ఏళ్లలో రూ.35 కోట్లతో ఉచిత చేపల సరఫరా చేశామని చెప్పారు.

మత్స్యకారులకు రూ.8 కోట్లతో మోపెడ్, వలలు, డీసీఎం వ్యాన్లు, మొబైల్ ఫిష్ మార్కెట్ వెహికిల్స్ తో అనేక సౌకర్యాలు కల్పించామన్నారు. రూ.72 లక్షలతో ఎనిమిది మత్స్య సహకార సంఘ భవనాలు, రూ.10 లక్షల వ్యయంతో బాల్కొండలో ఫిష్ మార్కెట్, 19 కుటుంబాలకు రూ.77 లక్షల ఇన్స్ రెన్స్ చెక్కులను అందజేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వచ్చాక గత ఏడు కోటి 74 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా, 83 లక్షల చేపలు సరఫరా చేసి, రొయ్యల పంపిణీ మరిచిందన్నారు. గత ఏడాది కోత విధించిన చేప పిల్లలు కలిపి ఈసారి పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స అభివృద్ధి అధికారి దామోదర్, మత్స్యకారులు పాల్గొన్నారు.

Leave a Reply