హైదరాబాద్, ఆంధ్రప్రభ : యూసుఫ్‌గూడాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, శివసేన రెడ్డి, గిరిధర్ రెడ్డి, జాన్సీ రెడ్డి వంటి ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చి ఓట్లు అడుగుతుందని స్పష్టం చేశారు. అయితే, “రూ. 5 వేలు తీసుకొని ఓటు వేయండి” అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూమ్, ఇంటికో ఉద్యోగం వంటి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని ఆయన విమర్శించారు.
మహిళా మంత్రి లేకుండా ఐదేళ్ల పాలన నడిపిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం కారణంగానే బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడానికి సహకరించిన బీఆర్‌ఎస్ రుణం తీర్చుకోవడానికే ప్రాధాన్యత లేని అభ్యర్థిని పెట్టారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల నుండి ట్రిపుల్ తలాక్, రైతుల చట్టాలకు మద్దతుగా ఓటేసిన బీఆర్‌ఎస్, బీజేపీ వేరు కాదని, బీజేపీ, బీఆర్‌ఎస్ ముసుగు వేసుకొని పని చేస్తుందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుందని మహేష్ గౌడ్ తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శిస్తూ, ప్రస్తుతం కొత్తగా రేషన్ కార్డులు అందిస్తున్నామని, కోటి 20 లక్షల మంది రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోనూ 40 వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
పేద ప్రజల గురించి ఆలోచించకుండా, కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై, ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఫార్మ్‌హౌస్ పాలన చేశారని బీఆర్‌ఎస్‌ను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తప్పుపట్టారు. బీఆర్‌ఎస్ నాయకులు అసహనంతో మాట్లాడుతూ, మైనారిటీలు, మహిళలతో మీటింగ్‌లు పెట్టి వారిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
తాము వస్తే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తీసేస్తామని బీఆర్‌ఎస్ చెబుతోందని, ఇది ప్రజలకు నష్టమని ఆయన అన్నారు. గత 10 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ ప్రాంతం అనేక దురలవాట్లకు, చెడు కార్యక్రమాలకు అడ్డాగా మారిందని, జూబ్లీహిల్స్ ప్రజలు ఈ విషయాలను ఆలోచించాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కోరారు.

