ADB | ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీలు
- పాఠశాల, నివాస గృహాలు, జాతీయ రహదారి పక్కనే తయారీ
- ఎలాంటి పన్ను కట్టని వ్యాపారులు
- వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు వినియోగం
- సమస్యల్లో పలు గ్రామాల పరిస్థితులు
ముధోల్, ఫిబ్రవరి 11( ఆంధ్రప్రభ): నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ఎండాకాలం సమీపించడంతో ఇప్పటి నుండే ఇటుకల వ్యాపారం మొదలైంది. ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకువచ్చి, కనీస నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా వ్యాపారం కొనసాగించడం పలు సమస్యలకు దారితీస్తోంది. కనీసం అధికారులు అక్రమ ఇటుక బట్టీల వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వేసవికాలంలో ఇళ్ళ నిర్మాణాలు ఎక్కువ జరగడంతో, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇటుకలను వాడుతున్నారు. దీంతో వీటికి మంచి గిరాకీ వుంది.
ఈ నేపథ్యంలో మండలంలో బైంసా – నిజామాబాద్ జాతీయ రహదారి వెంట భారీస్థాయిలో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పచ్చని పంట పొలాల మధ్య ఇలా ఇటుక బట్టీలు తయారు చేయడం వల్ల పక్కనే ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతోందని పలువురు రైతులు వాపోతున్నారు. రోడ్డు పక్కనే బట్టీలకు నిప్పు పెట్టడంతో రోడ్డు మొత్తం పొగతో నిండుతోంది. దీంతో ఆ దారిలో వచ్చి వెళ్లే ప్రయాణికులకు పలు సమస్యలు తలెత్తుతున్నాయని, పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

సమస్యల్లో పలు గ్రామాలు..
ముధోల్ మండలంలోని న్యూముద్గల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల పక్కనే ఓ యజమాని ఇటుక బట్టీలు నిబంధనలకు విరుద్ధంగా తయారు చేయడంతో పాఠశాల కిటికీల్లో నుండి పొగ, దుమ్ము, దూళితో నానారకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ పక్క విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరో పక్క నివాస గృహాలు పక్కనే ఇటుక బట్టీలు తయారు చేయడం వల్ల దుమ్ము, దూళి, పొగ, వాసన లాంటివి ప్రత్యక్షంగా పరిసర గ్రామాలను చుట్టుముట్టుతున్నాయి. దుస్తులు ఉతికి బయట ఆరేసుకోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడిందని, ఇటుక బట్టీలు కాల్చేటప్పుడు వచ్చే వాసన భరించలేని దుస్థితి నెలకొందని కొంత మంది గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవనం కూడా నలుపు రంగులోకి మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పన్ను ఎగ్గొడుతున్నా… చర్యలు శూన్యం…
ఎలాంటి పన్ను కట్టని వ్యాపారులు ఏటా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నా వీటి నిర్వాహకులు గ్రామ పంచాయతీలకు ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. వ్యాపారంలో 2శాతం పన్ను చెల్లించాలని నిబంధనలున్నా బట్టీల వ్యాపారులు పట్టించుకోవడం లేదు. తరోడా, చించాల, సరస్వతి నగర్, పిప్రి, ముద్గల్ గ్రామాల్లో ఇటుకబట్టి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి బట్టీలోనూ దాదాపు లక్ష నుంచి పది లక్షల వరకు ఇటుకలు కాల్చి ఒక్కొక్కటి రూ.8ల చొప్పున మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఒక యాజమాని కనీసం ప్రతి వేసవిలో 5లక్షల నుంచి 10 లక్షల వరకు ఇటుకలు విక్రయిస్తారు.
వీటి ద్వారా సుమారు రెండు కోట్ల రూపాయలు వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. కానీ పంచాయతీలకు ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. విక్రయ సమయంలో ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. దీంతో వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన రెండు శాతం పన్నులు చెల్లించడం లేదు. పంచాయతీ రాజ్ యాక్టు ప్రకారం గ్రామంలో జరిగే విక్రయాల్లో 2శాతం పంచాయతీ ఖాతాల్లో ఖచ్చితంగా జమ చేయాల్సి ఉంటుంది. కానీ వ్యాపారికి నేరుగా కొనుగోలు దారులు డబ్బులు చెల్లించడంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది.

వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు వినియోగం..
పచ్చని పొలాల్లో ఇటుకబట్టీల వ్యాపారం భూ పరిరక్షణ చట్టం ప్రకారం వ్యవసాయానికి పనికి రాని భూముల్లోనే ఇటుక బట్టీలు నిర్వహించాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పచ్చని పంట భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అధికారులకు మామూళ్లు చెల్లించి అడ్డదారుల్లో బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.
మండల కేంద్రానికి, గ్రామాలకు కూతవేటు దూరంలోనే ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారనే ఆరోపణలున్నాయి. ఆయా పంచాయతీ పరిధిలోని శివారు ప్రాంతాల్లో పంట పొలాల్లో ఇటుక బట్టీలను కొనసాగిస్తుండడం గమనార్హం. పచ్చని పొలాల పక్కనే ఇటుక బట్టీలు నిర్వహిస్తుండడంతో ఆ ప్రభావం వాటిపై పడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.