బంధాలు… అనుబంధాలు!
ప్రస్తుతం మనుషులకు టైం సరిపోవట్లేదా? అన్నట్లు ఉరుకులు పరుగుల జీవితంతో ఉంటున్నారు. దీనివల్ల
నైతేనేమి, ప్రస్తుతం ఉన్న న్యూక్లియర్ కుటుంబాలు వల్లనో ఆర్థిక స్వాతంత్య్రం వల్లనో, సార్థంతోనో వ్యక్తిగత ఆలోచనల వల్లనో, రక్తసంబాధాలు, స్నేహబంధాలు కనుమరుగై పోతున్నాయి. బంధం అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య వారధి లాంటిది. బంధం అంటే ఆప్యాయత. బంధం అంటే ప్రేమ. బంధం అంటే మమకారం. బంధం అంటే క్షమాగుణం. ఈ గుణాలు ఉంటేనే బంధాలు నిలబడతాయి. గురువు జ్ఞానాన్ని, మార్గదర్శకత్వం చేస్తే గురుశిష్య సంబంధం. అందుకే పూర్వం మనం గురువులను గౌరవించే వారం. ఇప్పటికే వారు ఎక్కడ కనపడినా గురువు గారు పలకరించడమో, శిష్యులు వందనం చేయడమో జరుగుతుంది. కాని ఈ నాటి తరంలో గౌరవభావం సన్నగిల్లింది. పూర్వం ఉమ్మడి కుటుంబంలో సభ్యులు మధ్య ఒక ఆత్మీయతా
భావం ఉండేది. పెద్దల మాటకు గౌరవించేవారు. తల్లిదండ్రులు వద్ద చరస్థిరాస్తి ఉంటేనే ప్రస్తుతం బంధాలు నిలబడుతున్నాయి. కేవలం ఆర్థిక బంధాలతోనే సమాజం ముడిపడి ఉంది. అదే ఆస్తిపాస్తులు లేనివారు విషయంలో వారి సంతానానికి నైతికత ఉంటేనే, భాధ్యతతో బంధాలు కాపాడుకొంటంన్న వారి సంఖ్య బహు తక్కువ. ఒకవేళ తమ ఆధీనంలో ఉన్న చరస్థిరాస్తులను పిల్లల ఒత్తిడి మీదో, ఎలాగైనా వాళ్ళకే ఇవ్వాలన్న ఆలోచనతో ముందుగానే ఇచ్చేస్తేనో, ఆ వృద్ధ దంపతులు బాధలు వర్ణనాతీతం.
కుటుంబ బంధాలు మంచి సమాజానికి హితువు. మంచి సమాజం దేశభవిష్యత్తుకు ముఖ్యం. బంధాలు నిలబడాలంటే తల్లిదండ్రులు చిన్నతనం నుండే వారిలో మోరల్ వాల్యూస్ పెంపొందించాలి. బంధాలు— అనుబంధాలు, మానవ సంబంధాలు జీవితానికి మూల సూత్రం. బంధాలు నిలబడాలంటే నమ్మకం విశ్వాసం, ఆత్మీయత ముఖ్యం. మనకు మార్గదర్శకాలు రామాయణ, మహాభారత భాగవతం అనబడే ఇతిహాసాలు. వీటిలోని ప్రతీ సంఘటన మనకు ఆదర్శప్రాయం. తెల్లవారితే శ్రీ రాముడికి పట్టాభిషేకం. కాని అంతలోనే పరిస్థితి మారిపోయి, అరణ్య వాసానికి బయలుదేరవలసి వచ్చింది. రాముడు తల్లి కైక స్వార్థంతో చెప్పినా, శిరసావ#హంచాడు. తండ్రి మాట నిలబెట్టిన ఘనుడు. సీతారాముల రక్షణకు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. భరతుడు అన్న గారి పట్ల చూపిన అనురాగం, గౌరవం యుగాలు మారినా మరిచిపోని బంధం.
అలాగే ధర్మజ్ఞుడు, ధర్మరాజు జూదంలో సర్వస్వం కోల్పోయినా, మిగిలిన సోదరులు తలవంచారే తప్ప ఎదురు
తిరుగలేదు. అదే బంధం. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక. ఏకపాదుడనే పండితోత్తముడు శిష్యులకు ఉపదేశం చేస్తూంటే, స్వరం తప్పగానే, ఆయన భార్య సుమతి గర్భంలో ఉన్న శిశువు గర్భం నుండే తండ్రికి సూచిస్తే ”ఇంకా పుట్టలేదు…నాకే పాఠాలు చెపుతావా? అని క్రోధంతో అష్ట వంకరలతో జన్మించు అని శాపం పెట్టాడు. శాపం కారణంగా అష్టావక్రుడు జన్మించి, తండ్రిని మించిన పండితుడు అయ్యాడు. ఒక సందర్భంలో తండ్రి జలనిమజ్జనలో ఉంటే రక్షించాడే తప్ప మనసులో ఎటువంటి కోపం పెట్టుకోలేదు. భగవంతునితో బంధం ఏర్పరచు కొంటే భక్తుడు అవుతాడు. ప్రకృతితో కూడా మనకు బంధాలు నెలకొన్నాయి. పంచభూతాలు అయిన పృథ్వి, అగ్ని, వాయివు, జలం, ఆకాశం వీటితో ప్రాణాధారమైన బంధాలు నెలకొన్నాయి. కాబట్టి ప్రకృతి నుండి, జంతువులు కీటకాలు నుంచి కూడా మనం బంధాలు గురించి నేర్చుకోవాలి. మనం మనకోసం, పిల్లలు భవిష్యత్తు కోసం, బంధాలు నిలబెట్టుకొందాం.
- అనంతాత్మకుల రంగారావు