Bonda Uma | రూ.20 కోట్లతో డిగ్రీ కళాశాల సాధ్యం..

Bonda Uma | రూ.20 కోట్లతో డిగ్రీ కళాశాల సాధ్యం..

  • పాయకాపురం జూనియర్ కళాశాలకు అప్‌గ్రేడ్ చేయాలి..
  • బీ.పి.ఎల్ విద్యార్థులకు ఉన్నత విద్యలో ఇబ్బందులు…
  • అసెంబ్లీలో ఎమ్మెల్యే బొండా ఉమ

Bonda Uma | ఆంధ్రప్రభ పాయకాపురం : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీ.పి.ఎల్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య అందుకోడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శాసనసభలో పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొంటూ, ఆ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరై కళాశాల పరిస్థితులను పరిశీలించిన విషయాన్ని గుర్తుచేశారు. వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడినట్లు తెలిపారు.

సుమారు రెండు లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ప్రభుత్వం తరఫున ఒక్క జూనియర్ కళాశాల మాత్రమే ఉండటం వల్ల విద్యార్థులు డిగ్రీ చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే విరమించుకునే పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడం అత్యవసరమని, సుమారు రూ.20 కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి సాధ్యమని సభలో స్పష్టం చేశారు. ఈ అంశాన్ని గతంలో కూడా ప్రస్తావించినట్లు గుర్తుచేసి, కళాశాల పరిశీలన సందర్భంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు.సెంట్రల్ నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను గౌరవించి, పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను వెంటనే డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బొండా ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply