తిరుపతి అపరిచితులకు చెక్

మూడేళ్లుగా బాంబు బెదిరింపులు
అన్నీ తప్పుడు మెయిల్సే
తనిఖీలు.. దర్యాప్తుల్లో అలసి సొలసిన పోలీసులు

( ఆంధ్రప్రభ , ఏపీ న్యూస్ వర్క్ ప్రతినిధి) : ఒకటా రెండా.. ఏకంగా మూడేళ్లుగా.. నాయనా పులివచ్చే కథలు గిర్రున గిరగిరా తిరుగుతున్నాయి. అదిగో అక్కడ ఐఈడీ.. ఇదిగో ఆర్డీఎక్స్ (RDX).. మరి కొన్ని గంటల్లో పేల్చేస్తున్నాం.. అంటూ అజ్ఞాత ఆకతాయిలు పోలీసులతో ఈమెయిలాట ఆడుతున్నారు. పాపం పోలీసులు పరుగులు తీస్తూనే ఉన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌లు (sniffer dogs) ఉరుకులు పెడుతున్నాయి. కడకు ఇది తప్పుడు సమాచారం అని ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇక తిరుపతి (Tirupati) జనమే కాదు.. ప్రపంచంలోని తిరుపతి వెంకన్న భక్త జన కోటి కూడా.. బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్స్.. కాల్స్ కు అదరటం లేదు. బెదరటం లేదు. కానీ.. ఒక్కటే ప్రశ్న.. జన కోటిని వేధిస్తోంది. మూడేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నా.. పరాచ అజ్ఞాత ఆగంతకుల జాడను మన నిఘా వ్యవస్థ ఎందుకు పసిగట్టలేకపోయింది. అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో శత్రువుల గుట్టుమట్టును రట్టు చేసే నిఘా వ్యవస్థ ఎక్కడ నీరుగారింది. ఎలా దారి తప్పింది. ఇంతకీ ఈ రహస్య దుండగులను పట్టుకోగలమా? లేదా? ఇవీ ప్రస్తుతం ప్రజానీకం సంధిస్తున్న ప్రశ్నలు.

తాజాగా ..అజ్ఞాత మూక చెలగాటం
ఔను.. అటు దసరా సందడి. ఇటు తిరుమల(Tirumala)లో బ్రహ్మోత్సవాలను టీటీడీ మహా వైభవంగా నిర్వహించింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం అధికారులను ప్రశంసించింది. ఈ మురిపెం ఎంత చేపో నిలబడలేదు. గత శుక్రవారం ( 2025 – అక్టోబర్ 3) రెండు ఈమెయిల్స్ పోలీసులను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఐఎస్ఐ, ఎల్టీటీఈ (ISI, LTTE) తిరుపతిపై ఫోకస్ పెట్టాయని, తిరుపతిలోని నాలుగు ప్రాంతాల్లో ఆర్డీఎక్స్, ఐఈడీ బాంబులు రెడీగా ఉన్నాయని .. ఇవన్నీ కోయంబత్తూరు నుంచి ఆపరేట్ చేస్తున్నారని, మరి కొన్ని గంటల్లో యాక్టివేట్ అవుతాయని ఈ మెయిల్స్ లో అదరగొట్టారు. ఇదంతా హోక్స్ (తప్పుడు కథ) అనుకుంటూనే తిరుపతి పోలీసులు బాంబుల అన్వేషణకు పరుగులు తీశారు. ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, శ్రీనివాసం, కపిలతీర్థం, గోవిందరాజ స్వామి ఆలయాల్లో తనిఖీలు చేశారు. బాంబులు లేవు. ఇవన్నీ తప్పుడు మెయిల్స్ గా నిర్ధారించారు. ఇక శని, ఆదివారాలు ( అక్టోబర్ 4, -5 తేదీల్లోనూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మళ్లీ అదే కథ అలిపిరి, విష్ణునివాసంల్లో తనిఖీ లు తప్పలేదు. ఇక ఏపీ సీఎం సొంతూరు నారా వరి పల్లెలో పోలీసులు జల్లెడ పట్టారు. ఈ 2 రోజులు యాంటీటీ-సబోటేజ్ చెక్‌లు చేశారు. మళ్లీ సోమవారం (2025 అక్టోబర్ 6 న) మరో మెయిల్ వచ్చింది. మంగళవారం సీఎం చంద్రబాబు తిరుపతికి వస్తున్నారు. ఈ తరుణంలో హెలీఫ్యాడ్ ను పేల్చటానికి ఐఈడీ (IED) లు రెడీ చేశామని అజ్ఞాత మూక హెచ్చరించారు. ఈ సారి మళ్లీ పోలీసులు పరుగో పరుగు.. హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తనిఖీ చేశారు. హు.. హోక్స్ అని తేల్చారు.

మూడేళ్లుగా మెయిలాటలు
తిరుపతి నగరంలో గత మూడేళ్లల్లో 5 సార్లు బాంబు హెచ్చరికలు తెరమీదకు వచ్చాయి. ఇవ్వన్నీ తప్పుడు బెదిరింపులేనని తేలింది. ఒక సారి ఆ ఘటనలను గుర్తు చేసుకుందాం.

అక్టోబర్ 24, 2024 (గురువారం):
లీలా మహల్, కపిలా థీర్థం, అలిపిరి ప్రాంతాల్లోని తిరుమల బైపాస్ రోడ్‌ లోని మూడు హోటళ్లు. రామానుజ సర్కిల్ మరొకటి కలిపి మొత్తం నాలుగు హోటల్స్ ను పేల్చి వేస్తామని సాయంత్రం 5:30 గంటలకు ఈ మెయిల్‌లు వచ్చాయి . పాకిస్థాన్ ఐఎస్ఐ (ISI) ఈ ఐఈడీలను (IED) యాక్టివేట్ చేస్తోందని, రాత్రి 11 PMకు పేలుతాయని హెచ్చరించారు. జాఫర్ సదీఖ్ అరెస్ట్‌కు ప్రతీకారంగా ఆ అపరేషన్ జరుగుతున్నట్టు ఈ మెయిల్ లో స్పష్టం చేశారు. యథాప్రకారం పోలీసులు, స్నిఫర్ డాగ్స్‌తో ఆ ప్రాంతాలన్నీ జల్లెడ పట్టారు. ఊపిరి పీల్చుకున్నారు.

అక్టోబర్ 25, 2024 (శుక్రవారం):
తిరుపతిలో మూడు , తిరుచానూరు ప్రాంతంలో ఒకటి, మొత్తం నాలుగు హోటళ్లకు (పేర్లు వెల్లడించలేదు) జాఫర్ సదీఖ్ అరెస్ట్ పై అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావటానికి ఈ మెయిల్‌లు పంపించారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేసంది. మళ్లీ పాత కథే హడావిడి చేసింది.

2024 అక్టోబర్ 26, (శనివారం):
రాజ్ పార్క్ హోటల్, వైస్రాయ్ హోటల్ (రెండు ప్రముఖ హోటల్స్ ) లోని పైప్ లైన్ ల్లో సల్ఫర్ ఆధారిత ఐఈడీ బాంబులు (IED) లు రెడీగా ఉన్నాయని, ఉదయం 10:35 AMకు యాక్టివేట్ అవుతాయని హెచ్చరించారు. లీలామహల్, కపిలతీర్థం, అలిపిరి సమీపంలో మూడు హోటల్స్ పేల్చివేస్తామని ఈమెయిల్స్ వచ్చాయి. నార్కొటిక్స్ కేసులో జైలుకు వెళ్లిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ జాఫర్ సాధిక్ ను (Jaffer Sadiq) విడిచి పెట్టాలని లేకపోతే తిరుపతిలో బాంబులు పేల్చుతామని ఈమెయిల్స్ వచ్చాయి. తిరుపతి ఈస్ట్ పోలీసులు FIR నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. తమిళనాడు సీఎం భార్య, TN CM కుటుంబం, డీజీపపీ పేర్లు ప్రస్తావించారు. కానీ ఎక్కడ బాంబులు దొరకలేదు. పక్క రాష్ట్రం నేత పేర్లు ప్రస్తావించంటంతో తిరుపతి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. – 2024 అక్టోబర్ 24న మూడు హోటళ్లను ఈమెయిల్ తో బెదిరించారు. మళ్లీ 25, -26 తేదీల్లో మరిన్ని హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మూడు రోజుల సిరీస్‌లో పోలీసు బృందాల్లు జుట్టు పీక్కున్నా.. అసలు అపరచితులెవ్వరో.. ఆచూకీ దొరకలేదు.

2025 అక్టోబర్ 27 (ఆదివారం)
వరదరాజ ఆలయానికి, మరో రెండు హోటళ్లను (పేర్లు వెల్లడి కాలేదు) పేల్చివేస్తున్నట్టు పాక్ ISI పేరిట ఈ మెయిల్‌లు వచ్చాయి. జాఫర్ సదీఖ్ అరెస్టుకు నిరసనగా పేల్చివేస్తున్నట్టు ఈ మెయిల్స్ లో ప్రస్తావించారు. స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో మళ్లీ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. తిరుపతిలో మొత్తం 9 నుంచి -11 హోటళ్లకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కానీ హోటళ్ల పేర్లను పోలీసులు గోప్యంగా ఉంచారు.

తిరుపతి కలెక్టరేట్ కూ ..
తిరుపతి కలెక్టర్ కూ బెదిరింపు మెయిల్ప్ వచ్చాయి. 2025 మార్చి 21న బాంబు బెదిరింపుతో కలెక్టరేట్ కార్యకలాపాలు ఆగిపోయాయి. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. యథాతథంగా ఈ మెయిల్స్ .. హోక్స్ అని నిర్ధారించారు. ఈ మెయిల్స్ ఎవరు పంపించారో.. ఇప్పటి వరకూ జాడ లేదు. విచారణలో ఎలాంటి పురోగతి లేదు. మరో 100 రోజుల్లోనే మళ్లీ కలెక్టరేట్ కు.. అగ్రికల్చర్ కాలేజీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. 2025 మే 29న ఈ రెండు చోట్ల బెదిరింపులు రావటంతో తనిఖీలు, తప్పుడు సమాచారం తెరమీదకు వచ్చాయి. ఇక ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటానికి సైబర్ టీమ్ నాన తంటాలు పడినా.. ఫలితం సున్నా.

ఈ బెదిరింపులతో ఎవరికి లాభం
తిరుపతిని పదే పదే ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బాంబు బెదిరింపుల మోటీవ్ ఇప్పటి వరకూ వెలుగు చూడలేదు. ఇవన్నీ తప్పుడు బెదిరింపులే. ప్రజల్లో భయాందోళన సృష్టించటం, స్థానిక పాలనను అస్తవ్యస్తం చేయటమే లక్ష్యంగా జరుగుతోన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. పనిలో పనిగా 2024 అక్టోబర్ 27న ఇస్కాన్ ఆలయం ( ISKCON), వరదరాజ స్వామి ఆలయం తదితర ఆధ్యాత్మిక సంస్థలను లక్ష్యంగా బెదిరిస్తే మతపర ఉద్రిక్తతలు రగులుతాయి. ఈ అంశంతో తిరుపతి పేరును దెబ్బతీయవచ్చనేది ఒక కుట్రగా అధికారులు భావిస్తున్నారు. ఈమెయిల్స్ , వాట్సాప్ లో బెదిరింపులు వస్తున్నాయి. అనామక ఖాతాల నుంచి హ్యాక్ ఖాతాల నుంచి వస్తున్నాయంటే సైబర్ దుష్ప్రవర్తన, వ్యక్తిగత కక్షల వల్ల కావచ్చు. 2025 అక్టోబర్ 3న ISI, LTTE పేరిట బెదిరింపులు .. స్థానిక రాజకీయ, సామాజిక సమస్యలను లేవనెత్తే ప్రయత్నం కావొచ్చు. కొందరు వ్యక్తులు , మూకలు సమాజం దృష్టిని ఆకర్షించేందుకు చేసే గిమ్మిక్కులు గా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బెదిరింపుల వెనుక ఖచ్చిత దోషులు దొరకటం లేదు. ఎందుకంటే స్పష్టమైన ఆధారాలు లేవు.

కేసుల దర్యాప్తు స్థితి గతి
ఈ బాంబు బెదిరింపు కేసుల్లో ఆధారాలు లేవు. దోషులు జాడ లేదు. పోలీసులు, సైబర్ టీమ్‌లు, బాంబ్ స్క్వాడ్‌లు ఎంత ప్రయ్నించినా .. అసలు కథ వెలుగులోకి రావటం లేదు. తిరుపతి ఎస్సీ ఎల్. సుబ్బరాయుడు నేతృత్వంలో పోలీసులు, సైబర్ , టెక్నికల్ టీమ్‌లు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), స్నిఫర్ డాగ్‌లు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించటం లేదు. కేసులు నమోదు చేశారు. సమగ్ర సెర్చ్ ఆపరేషన్లు జరిగాయి. ఈమెయిల్స్ ట్రేసింగ్ ఫలించలేదు.ఇక మిగిలింది. తిరుపతిలో భద్రత పెంచడం, ప్రజల్లో భయాందోళన లేకుండా పరిస్థితులను సరిచేయటమే లక్ష్యంగా కనిపిస్తోంది.

తెర మీదకు NIA
గత మూడేళ్లుగా (2022 నుంచి ) తిరుపతి విమానాశ్రయం, హోటళ్లు, కలెక్టరేట్, ఆలయాలు, విశ్వవిద్యాలయానికి, అనామక ఈమెయిల్ బెదిరింపులు వెనుక ఒకే వ్యక్తి ముఠా ఉన్నట్టు పోలీసుల అనుమానం. వీపీఎన్ (VPN) అధునాతన కమ్యూనికేషన్ టూల్స్ ను ఉపయోగించటంతో దీన్ని జాడ తెలుసుకోవటం కష్టతరంగా ఉంది. ఈమెయిల్స్ మూలాన్ని గుర్తించడానికి NIA సాంకేతిక నైపుణ్యం అవసరం. ఈ స్థితిలో ఈమెయిల్స్ ట్రేసింగ్, మూలాలు గు ర్తించడానికి తిరుపతి పోలీసులు ఎన్ఐఏ (NIA) సహాయం కోరారని ప్రచారం జరుగుతోంది. (ISI, LTTE పేర్లు ప్రస్తావనకు రావటంతో అంతర్జాతీయ సైబర్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ లింకులతో కేవలం ఎన్ ఐఏ మాత్రమే మూలాలను పసిగట్టగలదు. ఐతే, తిరుపతి పోలీసులు ఎన్ఐఏ సాయం కోరిన విషయం ఇంత వరకూ తేటతెల్లం కాలేదు. కానీ, గతంలో కలెక్టరేట్ లో బాంబు బెదిరింపు కేసులో ఈమెయిల్స్ మూలాలను కనుగొనేందుకు ఎన్ఐఏ సాయం కోరాలని తిరుపతి పోలీసులు భావించినా… ఎన్ఐఏ సాయం కోరలేదని తెలుస్తోంది. మరి తాజాగా ఐఎస్ఐ, ఎల్టీటీఈ ప్రస్తావనతో.. ఎన్ ఐఏ సాయం కోరక తప్పలేదని ప్రచారం జరుగుతోంది.

అపరిచితులు దొరకరా..
నిజానికి ఒక ఈమెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందో కనుక్కోవచ్చు, కానీ ఇది పూర్తిగా ఖచ్చిత సమాచారాన్ని ఇవ్వకపోవచ్చు. ఈమెయిల్ హెడర్‌లను (Email Headers) విశ్లేషిస్తే ఈ మెయిల్ ఎక్కడ నుంచి పంపించారో ఏ సర్వర్‌ల నుంచి చేరిందో తెలుసుకోవచ్చు. దీనికి కొన్ని దశలు.. – ఈమెయిల్ క్లయింట్‌లో (ఉదా: Gmail, Outlook), ఈమెయిల్‌ను ఓపెన్ చేసి “Show Original” లేదా “View Source” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. – ఇందులో “Received” లైన్‌లు ఉంటాయి, ఈమెయిల్ ఏ సర్వర్‌ నుంచి వచ్చిందో తెలుస్తుంది.

IP అడ్రాస్ గుర్తిస్తే ..

  • హెడర్‌లలో IP అడ్రాస్ ఉంటుంది. దీంతో ఈమెయిల్ పంపిన సర్వర్ ప్రాంతాన్ని గుర్తించవచ్చు. who.is లేదా IP lookup సైట్‌లలో IP address చెక్ చేయవచ్చు. కానీ, – స్పామ్ లేదా ఫిషింగ్ ఈమెయిల్స్ హెడ ర్‌లను మార్చవచ్చు, అవి తప్పుదారి పట్టించే సమాచారాన్ని కలిగి ఉండవచ్చు.
  • VPN లేదా ప్రాక్సీ సర్వర్‌లు ఉపయోగిస్తే అసలు గమ్మ స్థానాన్ని గుర్తించడం కష్టం. అందుకే – ఈమెయిల్ పంపిన వ్యక్తి ఖచ్చిత చిరునామా దొరకదు. ఎందుకంటే సర్వర్ స్థానం మాత్రమే తెలుస్తోంది, వ్యక్తి లొకేషన్ కాదు. గూగుల్, యాహూ సర్వీసులు ఈమెయిల్ హెడర్‌ల వివరాలను ఇవ్వవు. .

Leave a Reply