వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా (Mulugu District) ఏజెన్సీలో భారీగా వర్షం (Heavy rain) కురుస్తోంది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చికుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం (Bogatha Waterfall) పరవళ్లు తొక్కుతుంది. గత కొద్ది నెలలుగా నీరు లేక వెలవెలబోయిన బొగత జలపాతం జలకళ సంతరించుకుంది. బొగత జలపాతం అందాలు ప్రజలను అబ్బుర పరుస్తూ కనువిందు చేస్తున్నాయి. అయితే బొగతా జలపాతం వైపు వెళ్లకుండా పోలీసు బందోబస్తు (Police security) ఏర్పాటు చేశారు. వాటర్ ఫాల్స్ వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటకులను అనుమతించడం లేదని స్పష్టం చేశారు.

ములుగు జిల్లాలో వర్షపాతం…
ములుగు జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైంది. వెంకటాపురంలో అత్యధికంగా 30 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారంలో 18.4, మంగపేటలో 15.8, అలుబాక(జెడ్)లో 14.9, గోవిందరావుపేటలో 12.3, వెంకటాపూర్‌లో 8.9, లక్ష్మీదేవిపేటలో 9.3, వాజేడులో 7.2, ములుగు మండలం మల్లంపల్లిలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
ఇళ్లకు పరిమితమైన ప్రజలు
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఎవరు బయటికి రావడానికి సాహసం చేయడం లేదు. వాజేడు మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో వర్షాలు విపరీతంగా కురవడంతో్, డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. దీంతో ఆ గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వాజేడు మండలం పేరూరులో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


