17 మంది దుర్మరణం, మరో ఆరుగురికి గాయాలు
పేలుడు ధాటికి కుప్పకూలిన ఫ్యాక్టరీ భవనం
శిధిలలాలో చిక్కుకున్న కార్మికులు
కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
అహ్మదాబాద్ – గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బనస్కాంత జిల్లాలోని దీశ పట్టణంలో ఉన్న ఓ ఫైర్ క్రాకర్స్ తయారీ ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఈ పేలుళ్ల ధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది.. ఇప్పటి వరకు ఈ సంఘటనలో మొత్తం 17 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలింది. శిథిలాల కింద మరికొంత మంది కూలీలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. ఈ సంఘటనపై దీశ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విజయ్ చౌదరి మాట్లాడుతూ.. ‘ దీశ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ పేలుడు సంభవించినట్లు ఈ ఉదయం మాకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 12 మంది హాస్పిటల్ కు తరలిస్తుండగా మరణించారు. గాయపడ్డ ఆరుగురు కూలీలను ఆస్పత్రికి తీసుకెళ్లాము. పేలుడు చాలా భారీ స్థాయిలో జరిగింది. దీంతో ఫ్యాక్టరీ స్లాబ్ మొత్తం కూలిపోయింది. స్లాబ్ కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాము’ అని తెలిపారు.