BJP | అత్యంత హృదయ విదారకమైన ఘటన

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దిగ్భాంతి.
BJP | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో ప్రయాణికులు, తెలంగాణ వాసులు దుర్మరణం చెందడం అత్యంత హృదయ విదారకమైన ఘటన అని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలన్నారు. వారి కుటుంబాల పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ సంతాపం వ్యక్తం చేస్తోందన్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర పౌరులు ఇలాంటి దారుణ ప్రమాదానికి గురవడం కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తిందన్నారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయంలో భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు.
ఈ ప్రమాదం అనంతరం కేంద్ర విదేశాంగ శాఖ అత్యంత వేగంగా చర్యలు ప్రారంభించిందని తెలిపారు. మృతదేహాల గుర్తింపు, సహాయక చర్యలు, అలాగే సౌదీ అధికారులతో అవసరమైన సమన్వయం కోసం భారత ఎంబసీ ఇప్పటికే కార్యాచరణ చేపట్టిందన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంతో సమన్వయం పెంచి, మృతదేహాల తరలింపు సహా అవసరమైన అన్ని సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.
