DEATH| ఊట్కూర్, ఆంధ్రప్రభ: ఇంటి ముందు పని చేస్తుండగా గుండెపోటుతో బీజేపీ సీనియర్ నాయకుడు గీతా కార్మికుడు మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తుల కథనం ప్రకారం.. ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎల్బీనగర్ విదికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు గీతా కార్మికుడు వెంకటేష్ గౌడ్ (54) అనే వ్యక్తి శుక్రవారం ఇంటిముందు ముళ్ళ పొదలు తొలగించే పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.
దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్సలు నిర్వహిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ జెడ్పిటీసీలు సూర్య ప్రకాశ్ రెడ్డి, అరవింద్ కుమార్, బీజేపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, భాజపా మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ కృష్ణయ్య గౌడ్ తో పాటు పలువురు నాయకులు మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

