birthday |15వ ఏట అడుగుపెట్టిన వైభ‌వ్‌

birthday |15వ ఏట అడుగుపెట్టిన వైభ‌వ్‌

సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వెల్లువ‌
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ విషెస్‌
డ్రెస్సింగ్ రూమ్‌లో బర్త్‌డేను సెలెబ్రేష‌న్స్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ సంచలనం, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఈ రోజు 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బీహార్‌కి చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ మార్చి 27, 2011న జన్మించారు. ఐపీఎల్‌లో ఇత‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్నాడు. 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి, రికార్డు సృష్టించారు. అత్యంత చిన్న వయసులో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లలో ఒకరు. 15వ జన్మదినం జరుపుకుంటున్న వైభవ్ సూర్యవంశీకి సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ తమదైన శైలిలో వైభవ్ సూర్యవంశీకి బర్త్‌డే విషెస్ తెలియజేసింది.

‘బ్యాట్ పట్టిన ఒక కుర్రాడు.. తన కలను నిజం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగి ఈ స్థాయికి చేరుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ, ఈ రోజు నీది!’అని పోస్ట్ చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో వైభవ్ సూర్యవంశీ బర్త్‌డేను ఘనంగా సెలెబ్రేట్ చేశారు. కేక్ కట్ చేసిన అనంతరం వైభవ్.. సీనియర్ ఆటగాళ్లకు దొరకకుండా పారిపోయాడు. కేకు రుద్దుతారనే భయంతో వారికి దూరంగా పరుగెత్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే సమయం కూడా ఆసన్నమైందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ బిహార్ కుర్రాడు చెలరేగితే.. టీమిండియా టీ20 టీమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడని జోస్యం చెబుతున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు కనీస వయసు 15 ఏళ్లు. అదే జరిగితే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. 1989లో పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్‌తో సచిన్.. 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.

Leave a Reply