భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ధర్మపురి(ఆంధ్రప్రభ) : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ బి.సత్యప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మీ సేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునఃనిర్మాణం పనులకు సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, ధర్మపురి మండల తహసీల్దార్ ఎరుకొండ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


