నారాయణపేట, ఆంధ్రప్రభ : భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రధాన ధ్యేయమని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నరు. గురువారం నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామంలో గురువారం భూభారతి పోర్టల్, రెవెన్యూ సదస్సు, గ్రామ సభను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి అండగా ఉండేలా ఈ చట్టం తీసుకువచ్చామని అన్నారు. భూభారతి చట్టం దేశానికి ఆదర్శం కాబోతుందని పేర్కొన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారిని నియమిస్తామని తెలిపారు. రైతు భూముల సమస్యలకు భూభారతితో పరిష్కారం దొరుకుతుందని వెల్లడించారు. మొదటి విడతలో 6,000 మంది లైసెన్స్ ఉన్నసర్వేయర్లను నియమిస్తామని వివరించారు.
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం
రాష్ట్రంలో కొత్త భూ చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి దేశానికే రోల్ మోడల్ అని అన్నారు. ప్రతి ఒక్కిరికీ మంచి జరగాలనే భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చామని కామెంట్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ప్రతిపక్షాలు ఓర్వడం లేదని మండిపడ్డారు. ‘ధరణి’ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ లక్షలాది ఎకరాలను దొచేసిందని ఆరోపించారు. ధరణిలో తప్పులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలే తన వద్దకు వచ్చారని తెలిపారు.
అధికారులే ప్రజల దగ్గరకు వెళ్లి భూసమస్యలు పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. రైతుల భూ సమస్యలను తెలుసుకునేందుకు అన్ని రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. అందుకే నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశామని తెలిపారు. మే 1 నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 28 జిల్లాలో పైలట్ మండలాలుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. జూన్ 2న నాలుగు పైలెట్ మండలాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్య తీసుకుంటామని పేర్కొరన్నారు.