భద్రాచలం రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం, ఆంధ్రప్రభ : ఇంకా గోదావరి శాంతించ లేదు. భద్రాచలం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ, ఈ రోజు ఉదయం 9 గంటలకు 48 అడుగులకు చేరదంతో రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటించారు. ప్రస్తుతం నదీ ప్రవాహం ద్వారా 11,44,645 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నదని ఆయన తెలిపారు. ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుందని పేర్కొన్నారు.

ముంపు ముప్పు ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టరు సూచించారు. అధికారులు ఇప్పటికే పునరావాస చర్యలు చేపట్టారని, అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రజల కోసం తాగునీరు(Drinking water), ఆహారం(food), వైద్య సేవలు(medical services), విద్యుత్ సరఫరా (power supply) వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు ముంపు ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరిలోకి దిగి స్నానం చేయరాదని, పడవ ప్రయాణాలు పూర్తిగా నిషేధించబడినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సెల్ఫీలు లేదా వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు సులభంగా సహాయం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూముల(special control rooms)ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు క్రింది నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు:

  • సబ్ కలెక్టర్ కార్యాలయం, భద్రాచలం – 08743-232444
  • వరదల కంట్రోల్ రూమ్ – 7981219425
  • జిల్లా కలెక్టర్ కార్యాలయం, పాల్వంచ – 08744-241950
  • ఐటీడీఏ కార్యాలయం, భద్రాచలం – 7995268352

ప్రజలందరూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కలెక్టర్ కోరారు. జిల్లా యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తూ, ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు.

Leave a Reply