నంద్యాల మీదుగా బెంగళూరు–కలకత్తా రెగ్యులర్ ట్రైన్ మంజూరు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : గత ఏడాది కాలం నుంచి స్పెషల్ ఎక్స్ ప్రెస్ గా నడుస్తున్న రైలు నెంబర్ 02683 మరియు 02684 సంత్రగాచి- ఎల్హంక-సంత్రగాచి కి నడుస్తున్న వారంతపు స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసు ట్రైన్ ఆన్ డిమాండ్ గా పరిగణించి దక్షిణ మధ్య రైల్వే శాఖ ఏప్రిల్ 2 వ తేది నుండి రెగ్యులర్ వారంతపు ఎక్స్ ప్రెస్ గా రైలు నెంబర్ 18063 ఉంటుందని రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శుక్రవారం తెలిపారు.

ఈ రైలు ప్రతి గురువారం కలకత్తాలోని సంత్రగాచి నుండి బయలుదేరి దువ్వాడ, విజయవాడ మీదుగా నంద్యాలకు మరుసటి రోజు శుక్రవారం మధ్యాహ్నం 3:15 గంటలకు చేరి, ఎల్హంక(బెంగళూరు) వైపు బయలుదేరుతుందన్నారు. 18064 రైలు నెంబర్ ఎల్హంక లో ప్రతి శనివారం ఉదయం 4:50 నిమిషాలకు బయలుదేరి అనంతపురం, డోన్ మీదుగా నంద్యాలకు మధ్యాహ్నం 1:00 గంటలకు చేరుకొని విజయవాడ, దువ్వాడ మీదుగా కలకత్తాలోని సంత్రగాచికి మరుసటి రోజు సాయంత్రం ఆదివారం 5 గంటలకు చేరుకుంటుందన్నారు.
ఈ రైలు మొత్తం ఏ.సీ బోగీలతో నడుస్తుందన్నారు. స్పెషల్ ఎక్స్ ప్రెస్ గా ఉన్నప్పుడు ధర అధికంగా ఉండేది ఇప్పుడు రెగ్యులర్ రైలు కావడంతో 30 శాతం ధర తక్కువగా ఉంటుందని ఎంపీ శబరి తెలిపారు. నంద్యాల మీదుగా కలకత్తా, బెంగళూరుకు వెళ్లే నంద్యాల పార్లమెంట్ రైలు ప్రయాణికులు, నంద్యాల జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ఎంపీ కోరారు.
