15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత విస్తృత ప్రచారం

15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత విస్తృత ప్రచారం
- భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటున్న బస్తీ ప్రజలు
బెల్లంపల్లి, ఫిబ్రవరి 05 (ఆంధ్రప్రభ): బెల్లంపల్లి పట్టణంలోని 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంతకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చింతల వసంత తన ప్రచార పర్వంలో ప్రత్యర్థుల కంటే వేగంగా దూసుకుపోతున్నారు. గురువారం వార్డులోని ప్రతి గల్లీలోనూ, ప్రతి ఇంటి గడపను తడుతూ ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బస్తీ ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పడుతూ ఘనస్వాగతం పలికారు. మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నీరాజనాలు పడుతూ చింతల వసంతను ఆశీర్వదించారు. ప్రచారంలో భాగంగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అమలువుతున్న ఆరు గ్యారెంటీలు , వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. తాను కౌన్సిలర్‌గా ఎన్నికైన అనంతరం వార్డును అన్ని విధాల ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ముఖ్యంగా స్థానికంగా ఏళ్లుగా వేధిస్తున్న సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ప్రజలకు వివరించారు.
బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో వార్డుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత, ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ చేస్తున్న అభివృద్ధి పనులే తనను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సోషల్ మీడియా కమ్యూనికేషన్ జిల్లా కన్వీనర్ దేవసాని ఆనంద్, టేకులబస్తీ ఇన్ చార్జీ కన్నూరి వెంకటేష్, సీనియర్ నాయకులు దెబ్బటి రమేష్, కాశిపాక రాజరత్నం, ఎండి. గౌస్, కన్నూరి రాజలింగు, చింతల బాలరాజు, చింతల లోకేశ్వర్, రామ్ లక్ష్మీనారాయణ, బొల్లి వంశిలతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
