Bellampalli | పులి భయం – డప్పు చాటింపుతో అప్రమత్తం
బెల్లంపల్లి, ఫిబ్రవరి 16, (ఆంధ్రప్రభ) బెల్లంపల్లి నియోజకవర్గంలో పులి భయం వెంటాడుతోంది. గత 20 రోజులుగా బెల్లంపల్లి నియోజకవర్గం లోని బెల్లంపల్లి మండలం, కాసిపేట, తాండూర్ మండలాల్లో పులి సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు, అడవి పై ఆధారపడి జీవించే చిరు కూలీలు, రహదారులపై వెళ్లే వాహనదారులు పులి భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు పులి జాడను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, పులి భయం మాత్రం ప్రజలను వీడడం లేదు.
బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్ మండలాల ఆనుకొని ఉన్న అడవి ప్రాంతంలో పులి సంచరిస్తూ, అడవి జంతువులను వేటాడుతూ తినడం, అలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు బయటకు వెళ్లడానికి జెంకుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రతిరోజు అడవికి వెళ్లే పశువుల కాపలాదారులు, రైతుల కోసం గ్రామాల్లో డప్పు చాటింపు చేస్తూ అప్రమత్తం చేస్తున్నప్పటికీ, పులి విషయంలో అడవి అధికారులు పూర్తిగా సమాచారం అందించలేకపోతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి పట్టిన పులిబయమ్ ఎప్పుడు వీడుతుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.