Battalion | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Battalion | ఇటిక్యాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ బెటాలియన్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం పటాలం కమాండెంట్ ఎం. జయరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనిట్ అధికారి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి నిబద్ధతతో సేవలందించిన అధికారులకు సేవా పథకాలను అందజేశారు.

అనంతరం బెటాలియన్ సిబ్బంది అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం దేశానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజు, ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే రోజు అని అన్నారు.

ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్రపై మాట్లాడుతూ, రాజ్యాంగం ఇచ్చిన అధికారాలతో పాటు బాధ్యతలు మరింత ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం, చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడం పోలీస్ శాఖ ప్రధాన ధర్మమని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ప్రజలకు అంకితభావంతో, క్రమశిక్షణతో, నిజాయితీతో విధులు నిర్వర్తించినప్పుడే గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి నిజంగా నిలుస్తుందని అన్నారు.

ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే పోలీస్ శాఖకు అసలైన గౌరవమని, సేవా దృక్పథంతో పని చేస్తేనే సమాజంలో శాంతి, భద్రత నెలకొంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పాణి, ఇన్స్పెక్టర్లు ఆర్ పి సింగ్, నరసింహ రాజు, శ్రీనివాసులు, రాజేశం ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

Leave a Reply