Bandi Sanjay | తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే…

Bandi Sanjay | తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే…

నీళ్ల కోసం కొట్లాడింది బీజేపీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్


Bandi Sanjay | కరీంనగర్, ఆంధ్రప్రభ : నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఆరోపించారు. ఇవాళ‌ కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా నదీ జలాల వినియోగం అంశంలో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, (Congress, BRS) ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నదీ జలాల అంశాన్ని వాడుకుంటుందన్నారు.

బీఆర్ఎస్ వారి హయాంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా డ్రామాలు చేస్తున్నదన్నారు. కృష్ణ గోదావరి, నది జలాల వినియోగం అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ (Telangana) కు తీరని అన్యాయం చేసిందన్నారు. కృష్ణానది నుండి తెలంగాణ వాటా ఎనిమిది వందల టీఎంసీలకు పైగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో 200 టీఎంసీలు కూడా వాడుకోలేదని, గోదావరి జలాల అంశంలో 1400 టిఎంసిల నీటిని వాడుకునే వీలున్నా.. ప్ర‌స్తుతం 500 టీఎంసీల కంటే ఎక్కువగా వినియోగించుకోలేదన్నారు.

నదీ జలాల అంశంలో తెలంగాణకు కేసీఆర్ (KCR) అన్యాయం చేస్తుంటే కొట్లాడింది భారతీయ జనతా పార్టీ అని.. ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫీల్డ్ లో లేరన్నారు. దుబ్బాక హుజూరాబాద్ మునుగోడులో డిపాజిట్ కోల్పోయి దుర్భర స్థితిలో కాంగ్రెస్ ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ చేసిన యుద్ధం వల్లే తెలంగాణకు అన్యాయం జరగలేదన్నారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం జరగకుండా పూర్తిగా సహకరించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శాసనసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు.

Leave a Reply