Bandh | మళ్లీ రగిలిన ఉద్యమాగ్ని…

Bandh | మళ్లీ రగిలిన ఉద్యమాగ్ని…

  • ఆదోని జిల్లా డిమాండ్‌
  • జేఏసీ ఆధ్వర్యంలో బంద్‌
  • రోడ్డెక్కిన జనం… స్తంభించిన జనజీవనం

Bandh | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోనిని జిల్లా చేయాలనే డిమాండ్‌తో ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బంద్‌ ఉమ్మడి ఆదోని ప్రాంతంలో ఉధృతంగా కొనసాగుతుంది. ఆదోనితో పాటు మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు తదితర మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలపడంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా పర్యాటక క్షేత్రమైన మంత్రాలయం బంద్‌ ప్రభావంతో పూర్తిగా బోసిపోయింది. జేఏసీ పిలుపుతో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయగా, విద్యా సంస్థలు కూడా బంద్‌కు మద్దతు పలికాయి.

Bandh

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. డివిజన్ల విభజనే ఆగ్రహానికి మూలం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆశించారు. అయితే ప్రభుత్వం ఆదోనిని 1, 2 డివిజన్లుగా విభజిస్తూ జిల్లా అంశాన్ని పక్కనపెట్టడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దశాబ్దాలుగా ప్రాంతీయ పరిపాలనా కేంద్రంగా ఉన్న ఆదోనికి జిల్లా హోదా ఇవ్వకుండా చేతులు దులుపుకోవడమే ఈ ఉద్యమానికి ప్రధాన కారణంగా మారింది. తగ్గని డిమాండ్‌, తగ్గని ఉద్యమం ఆదోని జిల్లా కావాలన్న డిమాండ్‌ కొత్తది కాదని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ పలు దఫాలు ధర్నాలు, ర్యాలీలు, వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఆదోని ప్రజల ఆశలను నీరుగార్చాయని, దీంతో ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చిందని వారు అంటున్నారు.

Bandh

ప్రజల మద్దతుతో ముందుకు జేఏసీ ఈ బంద్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి లభించిన మద్దతు ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిందని జేఏసీ అభిప్రాయపడుతోంది. వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం. ఆదోనిని జిల్లా చేయాలనే డిమాండ్‌పై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని జేఏసీ హెచ్చరించింది. ప్రాంతీయ ఆకాంక్షలపై ప్రభుత్వ స్పందన ఎప్పుడు? ఆదోని ప్రాంత ప్రజల ఆకాంక్షలు, భావోద్వేగాలను ప్రభుత్వం ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. జిల్లా హోదా కోసం సాగుతున్న ఈ ఉద్యమం ఇకపై ఎలాంటి మలుపు తిరుగుతుందో, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply