బైచిగేరి ఎంపీటీసీ అదృశ్యం
బైచిగేరి ఎంపీటీసీ అదృశ్యం
రెండు రోజులుగా కనిపించని నాగభూషణ్ రెడ్డి
ఆందోళనలో కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోని మండల పరిధిలోని బైచిగేరి గ్రామ ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డి కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. రెండు రోజులుగా ఆయన ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎంపీటీసీ భార్య విజయలక్ష్మి కన్నీటి పర్యంతవుతూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. నా భర్తను ఎవరో కిడ్నాప్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్య తీసుకోలేదు. దయచేసి నా భర్తను కాపాడండి అంటూ ఆమె వేడుకుంటున్నారు.
రెండు రోజులుగా కనబడడం లేదని..
విజయలక్ష్మి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులో నాగభూషణ్ రెడ్డి రెండు రోజుల కిందట ఇంటి నుంచి బయలుదేరి తిరిగి రాలేదని పేర్కొన్నారు. మొదట కుటుంబ సభ్యులు స్వయంగా అన్వేషించినా సమాచారం లభించలేదని, చివరికి తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని తెలిపారు. అయితే పోలీసులు దర్యాప్తు జరుగుతోంది అనే మాట తప్ప, పటిష్ట చర్యలు తీసుకోవడంలేదని ఆమె ఆరోపించారు.
ఎస్పీ, డీజీపీ స్పందించాలని విజ్ఞప్తి
తన భర్త భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన విజయలక్ష్మి, రాష్ట్ర పోలీస్ ప్రధానాధికారి (డీజీపీ), జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించాలని వేడుకుంది. దుండగుల బారి నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఒక ప్రజాప్రతినిధి కూడా భద్రంగా లేని పరిస్థితి వస్తే సాధారణ ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుంది? అని ఆమె ప్రశ్నించారు.
గ్రామంలో ఉద్రిక్త వాతావరణం
ఈ ఘటనతో బైచిగేరి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ అదృశ్యానికి రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు స్థానిక నేతలు ఆయన ఇటీవల గ్రామ అభివృద్ధి పనుల్లో చురుకుగా వ్యవహరించారని, కొన్ని వర్గాలకు అది నచ్చలేదని పేర్కొంటున్నారు. పోలీసులు అయితే ప్రాథమిక విచారణ కొనసాగుతోంది, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. అని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రజాప్రతినిధులపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.