ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ

ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ
గ్లకోమా పట్ల అప్రమత్తంగా ఉండాలి: జేసీ నూరుల్ ఖమర్
కర్నూలు, ఆంధ్రప్రభ: గ్లకోమా వంటి కంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి కంటి చూపును కాపాడుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సూచించారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా బుధవారం కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి నుండి రాజవిహార్ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహన వాకథాన్ ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8 నుండి 14 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం “గ్లకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యమవ్వండి” అనే నినాదంతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గ్లకోమా (నీటి కాసులు) అనేది కంటి చూపును క్రమంగా తగ్గించే ప్రమాదకర వ్యాధి అని, చాలా సందర్భాల్లో లక్షణాలు కనిపించకపోవడంతో దీనిని “నిశ్శబ్ద శత్రువు”గా వైద్యులు పేర్కొంటారని తెలిపారు.
క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గ్లకోమాను ముందుగానే గుర్తించి అంధత్వాన్ని నివారించవచ్చని జాయింట్ కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు, అలాగే కుటుంబంలో గ్లకోమా చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. భాస్కర్, ప్రభుత్వ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డా. సత్యనారాయణ రెడ్డి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డా. యుగేందర్ రెడ్డి, జిల్లా అంధత్వ నివారణ అధికారి డా. హిమబిందు పాల్గొన్నారు.
అలాగే సుశీల నేత్రాలయ తరపున డా. సుధాకర్ రావు, డా. నేహా, మోడరన్ ఐ హాస్పిటల్ తరఫున డా. రాజశేఖర్, డా. అనిల్ కుమార్, రిటైర్డ్ సూపరింటెండెంట్ డా. గిడ్డయ్య, ఐఎంఏ సభ్యులు డా. రామచంద్ర నాయుడు, డా. నాగ సురేష్, డా. రాధిక, డా. పుష్పలతతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యాధికారులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నారు.
