ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారిద్దాం

ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారిద్దాం
- ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి.సాయిలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి.సాయిలు, రాములు, గోప్య చౌహన్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ రామకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రన్సిపాల్ డాక్టర్ ప్రవీణ ఆధ్వర్యంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు 2, 3, 4ల ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన కల్పగుర్, అంగడిపేట్, మల్కాపూర్‌లలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి.సాయిల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో గ్రామాల్లో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
ట్రిపుల్ రైడింగ్ నేరమని, ఓవర్‌టేకింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్, లైసెన్స్, నంబర్ ప్లేట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను ఓపెన్ చేయరాదని, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.
సైబర్ మోసాలకు గురైన వారు 24 గంటలలోపు 1930కు కాల్ చేస్తే నష్టపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. బాలికల భద్రతకు సంబంధించిన పోక్సో యాక్టు కింద కఠినమైన శిక్షలు ఉంటాయని, 18 ఏండ్లలోపు బాలికలపై ఏ విధమైన వేధింపులు చేయరాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, వలంటీర్లు పాల్గొన్నారు.
