ఆటిజాన్ని అర్థం చేసుకుందాం.. ఆత్మీయ‌త‌ను పంచుదాం

ఆటిజాన్ని అర్థం చేసుకుందాం.. ఆత్మీయ‌త‌ను పంచుదాం

ప్రత్యేకతను ప్రోత్సహిస్తే ప్రతిభ వికసిస్తుంది..
వ‌ర‌ల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆటిజాన్ని స‌రైన విధంగా అర్థం చేసుకొని.. చిన్నారుల‌కు ఆత్మీయత పంచుదామ‌ని, ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయ‌ని, ఆ ప్ర‌త్యేక‌త‌ల‌ను గుర్తించి ప్రోత్సహిస్తే వారు జీవితంలో మెరుగైన స్థాయికి చేరుకుంటారని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పేర్కొన్నారు. వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే సందర్భంగా గురువారం న‌గ‌రంలోని ఆయోధ్య‌న‌గ‌ర్‌లో గ‌ల చేయూత మాన‌సిక దివ్యాంగుల శిక్ష‌ణ సంస్థ‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఆటిజం స్ప్రెక్ట్ర‌మ్ డిజార్ట‌ర్‌పై జ‌రిగిన అవగాహ‌న స‌ద‌స్సుకు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ హాజ‌ర‌య్యారు.

చిన్నారుల క్షేమ‌స‌మాచారాన్ని, వారి ప్ర‌త్యేక అవ‌స‌రాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆటిజం అనేది లోపం కాదని, అది ఒక ప్రత్యేకమైన స్థితి మాత్రమేనని, సరైన శిక్షణ, మద్దతు ఉంటే వారు కూడా సమాజంలో సమానంగా ఎదగగలరని తెలిపారు. ఆటిజం ఉన్నవారి అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోంద‌ని.. అదేవిధంగా 20 ఏళ్లుగా చేయూత డైరెక్ట‌ర్ డా. టి.కృష్ణ‌కుమారి చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయ‌మైన‌ద‌ని పేర్కొన్నారు.

ఆటిజం చిన్నారుల‌కు నైపుణ్యాభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో పాటు క్రీడ‌లు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, స్విమ్మింగ్ త‌దిత‌రాల్లో ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు. చేయూత పిల్ల‌ల క‌ళాత్మ‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు, వేస్ట్ మెటీరియ‌ల్‌, న్యూస్ పేప‌ర్ల‌తో చేసిన గిఫ్ట్ ఐటెమ్స్‌ను పరిశీలించి ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించారు. చిన్నారుల‌కు ఇచ్చే ప్ర‌త్యేక శిక్ష‌ణ విష‌యంలో అన్ని విధాలా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామ‌ని డా. కృష్ణ‌కుమారికి తెలిపారు.

Leave a Reply