అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి..

అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి..
జైనూర్, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు అడవి జంతువుల ఆహారంగా మారిపోతున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని కిషన్ నాయక్ తండాకు చెందిన రైతులు పత్తి, వరి పంటలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పత్తిపంట కాయదశలో ఉండగా, వరి పంట కోత దశలోకి చేరింది. అయితే ఈ సమయంలో అడవి పందులు గుంపులుగా వచ్చి రాత్రింబవళ్లు పంటలను ధ్వంసం చేస్తున్నాయి.
ఆ గ్రామానికి చెందిన రాథోడ్ బాలాజీ తండ్రి సంజీవ్ నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. అందులో రెండు ఎకరాల్లో పంటను అడవి పందులు పూర్తిగా నాశనం చేశాయి. కష్టపడి వేసిన పంటలు ఇలా నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ “పండించే పంటలు మా చేతికి రావడం లేదు. మేము ఎలా బతకాలి, మా అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రింబవళ్లు కాపలాగా నిలబడుతూ, పంటను రక్షించుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, అడవి పందుల గుంపులను నియంత్రించలేకపోతున్నారని వారుఆవేదనవ్యక్తపరుస్తున్నారు. తమ పంటలకు జరిగిన నష్ట అటవీశాఖ రెవెన్యూ అధికారులు సర్వే చేయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ, మండల అధికారులు తక్షణ చర్యలు తీసుకొని పంటల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అడవి జంతువుల బెడదకు తగిన పరిష్కారం చూపకపోతే, రైతుల పరిస్థితి మరింత దారుణమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
