Audio Song | రాయలసీమ నీటి హక్కుల కోసం… చైతన్య గీతం…

Audio Song | రాయలసీమ నీటి హక్కుల కోసం… చైతన్య గీతం…

  • చిన్నారి స్వరంలో రాయలసీమ నీటి ఆకాంక్ష పాట ఆకట్టుకున్న వైనం..
  • రాయలసీమ నీటి హక్కులపై ఆడియో పాటను ఆవిష్కరణ…

Audio Song | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ సస్యశ్యామలం చేసే దిశగా ప్రజలను మరింత చైతన్యవంతులను చేసి, పాలకులపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఒక చైతన్య గీతాన్ని ఇవాళ‌ ఆవిష్కరించింది. గత రెండేళ్లుగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవాల్లో పాల్గొంటున్న ఏడు సంవత్సరాల బాలుడు “యువన్” ఈ ఆడియో పాటను విడుదల చేశారు. నంద్యాలలోని సాగునీటి సమితి ప్రధాన కార్యాలయంలో అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

బొజ్జా మాట్లాడుతూ… ఈ పాట రాయలసీమ సమాజంలో మరింత చైతన్యాన్ని కలిగించి, సాగునీటి హక్కుల సాధన దిశగా ప్రజలకు ప్రేరణనిస్తుందన్నారు. గత 14 సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి చేసిన కార్యక్రమాలను వివరించారు.‌ ప్రజా చైతన్యమే లక్ష్యంగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేపట్టి రాయలసీమలో సాగునీటి ఉద్యమానికి బలమైన పునాది వేసిందన్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి ఎత్తిపోతల పథకాలకు పాలనా అనుమతులు సాధించడంతో పాటు, పులికనుమ ప్రాజెక్టు సత్వర నిర్మాణం చేయించడంలోనూ, శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండేలా కృష్ణానది యాజమాన్య బోర్డు రూల్ కర్వ్ సాధించడంలో సమితి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసారు.

రాయలసీమకు 30 రోజుల్లో 120 టీఎంసీల నీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ – బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీసే ప్రభుత్వ చర్యలను అడ్డుకునే దిశగా సమితి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. “గోదావరి–బనకచర్ల” పేరుతో లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని గత 70 ఏళ్లుగా కొనసాగుతున్న మోసాలనే కొనసాగిస్తున్నారని వీరు విమర్శించారు.

ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు యర్రం శంకర రెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, కోశాధికారి చిరుకూరి వెంకటేశ్వర నాయుడు, ప్రచార కార్యదర్శి నిట్టూరు సుధాకర్ రావు, కార్యవర్గ సభ్యులు సౌదాగర్ కాశిం మియా, కొమ్మా శ్రీహరి, పట్నం రాముడు, రాఘవేంద్ర గౌడ్, న్యాయవాది అసదుల్లా మియా, జానోజాగో మెహబూబ్ భాష, మహమ్మద్ పర్వీజ్, మనోజ్ కుమార్ రెడ్డి, కాంట్రాక్టర్ లక్ష్మయ్య, సిద్దం శంకర్ రెడ్డి, తదితరలు పాల్గొన్నారు.

Leave a Reply