రేణిగుంట సర్కారీ హైస్కూలులో..

రేణిగుంట సర్కారీ హైస్కూలులో..

  • తాగునీటికి విద్యార్థులు కటకట…

ఆంధ్రప్రభ, రేణిగుంట (తిరుపతి జిల్లా) : రేణిగుంట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు త్రాగడానికి మంచి నీళ్లు లేక విద్యార్థులు హిందూ స్మశాన వాటికలో నీళ్లు తాగుతున్న ఘటన పట్టణ ప్రజలు మనసు చలించివేసింది. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురు పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు.

చారిత్రాత్మకమైన జిల్లా పరిషత్ బాలురు పాఠశాల నందు విద్యార్థులకు మంచినీళ్లు లేక పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నవేళ పాఠశాలలో భోజనం చేసిన విద్యార్థులు క్యారేజ్ గిన్నెలు కడుక్కోవడానికి తాగడానికి మంచి నీళ్లు లేకపోవడంతో పక్కనే ఉన్న హిందూ స్మశాన వాటికలో విరిగిపోయిన కుళాయిలో వచ్చే నీటితో గిన్నెలు కడుక్కొని మంచి నీరు తాగుతున్నారు.

ఆ నీళ్లు తాగడం కోసం విద్యార్థులు తోపులాటలను చూసి పట్టణ ప్రజలు నివ్వరు పోయారు. విద్యార్థులకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో పాఠశాల హెడ్మాస్టర్ విధులు నిర్వహిస్తున్నారు అంటూ మండి పడుతున్నారు. పాఠశాలలో తాగడానికి మంచి నీళ్లు లేకపోవడానికి గల కారణాలు వివరాలు తెలియాల్సి ఉంది.

పాఠశాలలో విద్యార్థులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వైఫల్యం చెందింది. విద్యార్థులకు తాగునీరు కల్పించలేని పరిస్థితిలో ప్రధానోపాధ్యాయులు ఉన్నారంటే అక్కడ చదువుకునే విద్యార్థులు పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు హిందూ స్మశాన వాటికలో మంచినీళ్లు త్రాగడం చూసి జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డయేరియా ఛాన్స్

హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేసుకొని కాళ్లు చేతులు మొహం కడుక్కునే కుళాయి నుండి వచ్చే నీళ్లను జిల్లా పరిషత్ బాలురు పాఠశాల విద్యార్థులు తాగుతున్నారంటే ఆ విద్యార్థుల బాధలు వర్ణనతీతం. పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పడంతోపాటు విద్యార్థులకు కనీస సౌకర్యాలు అయిన తాగడానికి మంచినీళ్లు అందించాలని ఆలోచన పాఠశాల హెడ్మాస్టర్కు లేకపోవడం శోచనీయం. విద్యార్థులు హిందూ స్మశాన వాటికలో పైపుల ద్వారా వచ్చే నీరు కలుషితమై వాటిని సేవిస్తే విద్యార్థులకు డయేరియా వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరు కలుషితమై పైప్ లైన్ ద్వారా సరఫరా అవుతున్నాయని నీరు వేడి చేసి తాగాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అయితే జిల్లా పరిషత్ బాలురు పాఠశాల విద్యార్థులు హిందూ స్మశాన వాటికలో పైప్ లైన్ ద్వారా వచ్చే నీళ్లు తాగుతుండడంతో ఏమి జరుగుతుందన్న భయం విద్యార్థుల తల్లిదండ్రులలో ప్రశ్నార్ధకంగా మారింది. ఇదివరకే గుత్తి వారి పల్లి గ్రామంలో డయేరియా గురించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది.

డయోరియాతో ఇద్దరు మృతిచెందగా 70 మంది ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ అప్పటి అధికారులపై చర్యల తీసుకోవాలని సంబంధిత కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.జిల్లా పరిషత్ బాలురు పాఠశాలలో తాగడానికి నీరు లేదని తెలిసి కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎందుకు చర్యలు తీసుకోలేదొ అర్థం కావడం లేదు. కనీసం పాఠశాలలో తాగడానికి మంచి నీళ్లు కల్పించలేని పరిస్థితుల్లో పాఠశాల హెడ్మాస్టర్ ఉన్నారంటే విద్యార్థులకు ఏమాత్రం విద్యాబుద్ధులు నేర్పించగలరు అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

విద్యార్థులకు మంచినీళ్లు మహాప్రభో..

జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠశాలలో తాగడానికి మంచి నీళ్లు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పైప్ లైన్ లో వచ్చే నీరు కలుషితమై ఉంటుందని ఆ నీరు తాగడం వలన విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలురు పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారులు చొరవ చూపి మంచినీళ్లు అందించాలని పలువురు కోరుతున్నారు.

పట్టించుకోని హెడ్మాస్టర్

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తాగడానికి కనీసం మంచినీళ్లు కల్పించలేని హెడ్మాస్టర్ పై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పాఠశాలలో తాగడానికి నీళ్లు లేకపోతే బయట నుంచి తెప్పించైనా విద్యార్థులకు మంచినీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత పాఠశాల హెడ్మాస్టర్ పై ఉందన్నారు. హిందూ స్మశాన వాటికలో వెళ్లి విద్యార్థులు మంచినీరు తాగుతున్నారంటే బాధ్యులపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి పాఠశాల హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply