Assembly | ఎపిని గంజాయి ర‌హిత రాష్ట్రంగా మార్చుతాం – హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత


వెల‌గ‌పూడి – ఆంధ్ర‌ప్ర‌భ – 2021 దేశ వ్యాప్తంగా 7 లక్షల 40 వేల గంజాయి దొరికితే అందులో 2 లక్షల గంజాయి ఏపీలో పట్టుపడిందని వెల్లడించారు ఎపి హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత. ఇటివ‌లే 70 వేల కిలోల గంజాయిని ఒడిస్సా నుంచి వస్తున్న నేపథ్యంలో పట్టుకోవడం జరిగిందని.. దానిని కాల్చివేయ‌డం జ‌రిగిందన్నారు. ఏపీ శాసమండలిలో మాదక ద్రవ్యాల వినియోగంపై చర్చ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. గంజాయిపై ఉక్కు పాదం మోపాల‌ని టార్గెట్‌గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటి దగ్గరే గంజాయి తాగి అత్యాచారం చేస్తే కనీసం నిందితులను గుర్తించే పరిస్థితి లేకుండా ఉన్నాయని మండిపడ్డారు.

జ‌గ‌న్ పాల‌న‌లోనే 2021లో వైజాగ్‌లో మూడు గ్రాములకు సంబంధించి కొకైన్ కేసు నమోదు జ‌రిగింద‌న్నారు. 2025లో గుంటూరులో కొకైన్ కేసు నమోదు చేశామన్నారు. డ్రగ్ కంట్రోల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లతో కోఆర్డినేషన్ చేస్తున్నామన్నారు. గంజాయికి అలవాటు పడిన వారిని మత్తు పదార్థాలకు బానిసలైన వారిని డీ అడిషన్ సెంటర్లకు పంపిస్తున్నామన్నారు. ఏపీలో సాగు తగ్గిన తర్వాత ఒడిస్సా నుంచి ఏపీకి ఎక్కువగా ట్రాన్స్‌పోర్టు అవుతుందన్నారు. ఒడిస్సా ప్రభుత్వంతో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

డ్రోన్ కార్పొరేషన్‌తో డ్రోన్‌లు వాడకం తీసుకొచ్చామని తెలిపారు. డ్రోన్ వస్తే పోలీసులు వస్తారని అనేక ప్రాంతాల్లో స్వయంగా గంజాయి పండిస్తున్న వాళ్లే ధ్వంసం చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. గంజాయి సాగు అనేది 90% వరకు తగ్గిపోయిందని తెలిపారు. నార్కోటిక్ చట్టం ప్రకారం సాగు చేసిన, అమ్మిన, దానిని ప్రేరేపించిన, దానిని ఉపయోగించిన గంజాయి విషయంలో కఠినమైన చట్టాలు ఉన్నాయన్నారు. అనేక మంది వెనుకబడిన వర్గాల పిల్లలు ఈ కేసుల్లో ఇరుక్కున్న మాట వాస్తవమన్నారు. అన్ని డిపార్ట్‌మెంట్లలో గంజాయి నియంత్రణపై కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి నియంత్రణలో భాగంగా ఆస్తులు జప్తు కూడా చేస్తున్నామని తెలిపారు అనిత .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *