ఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో నాలుగు మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు రూ.24 కోట్లకు పైగా నిధులతో.. నాలుగు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఈ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. సుమారు 894 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు రూపొందించగా.. ఈ ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలోని 18 జిల్లాలను కలుపుతూ విస్తరించనున్నాయి.
ప్రాజెక్టుల వివరాలు:
- వార్ధా – భూసావాల్ (మహారాష్ట్ర): 314 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ నిర్మాణం.
- గోండియా – డొంగార్గఢ్ (మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్): 84 కిలోమీటర్ల మేర నాలుగో లైన్ నిర్మాణం.
- వడోదర – రాత్లాం (గుజరాత్, మధ్యప్రదేశ్): 259 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైన్ నిర్మాణం.
- ఇటార్సీ – భోపాల్ (మధ్యప్రదేశ్): 237 కిలోమీటర్ల మేర నాలుగో లైన్ నిర్మాణం.
- ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 3,633 గ్రామాలకు కనెక్టివిటీ పెరుగుతుందని కేంద్రం పేర్కొంది.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. ఈ నాలుగు రైల్వే ప్రాజెక్టులను పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ఆమోదించినట్లు ఆయన స్పష్టం చేశారు. లైన్ సామర్థ్యం పెంపుదల వలన రైల్వేల మొబిలిటీ పెరుగుతుందని, దాంతో భారతీయ రైల్వేల సామర్థ్యం, సేవా విశ్వసనీయత మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్టులను 2030-2031 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఈ కొత్త లైన్లు సాంచి, సాత్పురా టైగర్ రిజర్వ్, భీంబెట్కా రాక్ షెల్టర్స్, హజారా జలపాతం, నవేగావ్ నేషనల్ పార్క్ వంటి ప్రముఖ పర్యాటక.. చారిత్రక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని అందిస్తాయి. అంతేకాకుండా, బొగ్గు, కంటైనర్లు, సిమెంట్, ఫ్లై యాష్, ఆహార ధాన్యం, ఉక్కు వంటి ముఖ్యమైన వస్తువుల రవాణాకు కూడా ఈ లైన్లు ఎంతగానో దోహదపడతాయి.