అంగన్వాడి భవనానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ కి వినతి

అంగన్వాడి భవనానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ కి వినతి

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో మంజూరైన అంగన్వాడి కేంద్ర భవన నిర్మాణానికి తక్షణమే స్థలం కేటాయించాలని మద్దులపల్లి గ్రామ సర్పంచ్ ఏల్పుల సరిత ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో అంగన్వాడి కేంద్రానికి స్వంత భవనం లేకపోవడంతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె వినతిపత్రంలో వివరించారు. ప్రస్తుతం తాత్కాలిక సదుపాయాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నందున సరైన వసతులు లేక పిల్లల ఆరోగ్యం, పోషణ సేవలు ప్రభావితమవుతున్నాయని తెలిపారు.


ప్రభుత్వం అంగన్వాడి భవన నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరు చేసినప్పటికీ స్థలం కేటాయింపు జరగకపోవడంతో పనులు ప్రారంభం కాలేదని వారు పేర్కొన్నారు. గ్రామంలోని అనుకూలమైన స్థలాన్ని గుర్తించి వెంటనే కేటాయించాలని, తద్వారా నిర్మాణ పనులు ప్రారంభించి చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.


వినతిపత్రాన్ని స్వీకరించిన కలెక్టర్ రాహుల్ శర్మ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు అంగన్వాడి భవనం త్వరితగతిన నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply