AP | గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం…

AP | గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం…

  • కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష
  • సీమ సస్యశ్యామలం చేసుకునేందుకు
  • గుండ్రేవులే మార్గం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమకు జీవనాడి గుండ్రేవుల ప్రాజెక్ట్ సాధనలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఐక్య పోరాటం చేస్తామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష అన్నారు. సోమవారం రాజ్ విహార్ నుండి ధర్నా చౌక్ వరకు రైతులు, యువత, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద 48 గంటల జల సమర దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ.. కర్నూలు నగరానికి తాగునీరు, పశ్చిమ కర్నూలు రైతులకు సాగునీరు అందించగల శాశ్వత పరిష్కారంగా భావిస్తున్న గుండ్రేవుల ప్రాజెక్ట్ అత్యవసరతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కేపియస్ ఈ దీక్షను నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ నీటి భద్రత, సాగునీటి స్థిరీకరణ, పరిశ్రమలకు నీటి లభ్యత, వర్షప్రమాద నియంత్రణ వంటి అంశాల్లో శాశ్వత మార్పులు సంభవిస్తాయని. ప్రజలు, యువత, విద్యార్థులు, రైతు సంఘాలు కలిసి చేస్తున్న ఈ ఉద్యమం ప్రాంత భవిష్యత్తు కోసం ప్రజా ఐక్యతకు పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు.

ఉదయం రాజ్‌విహార్ ఆర్టీసీ పాత డిపో వద్ద రైతులు, యువత, విద్యార్థులతో భారీ ర్యాలీ ప్రారంభమై ధర్నా చౌక్‌కు చేరుకుంది. అక్కడ నిర్వహించిన సభలో నేతలు గుండ్రేవుల ప్రాజెక్ట్ అత్యవసరతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎం.శ్రీహర్ష 48 గంటల జల సమర దీక్షకు కూర్చున్నారు.

దీక్షకు మద్దతుగా సీఎల్పీఎం సెంట్రల్ జనరల్ సెక్రటరీ గఫూర్, జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ జి.పుల్లయ్య, కె.వి.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలు ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్ మంసూర్, మాజీ కార్పొరేటర్ పుల్లారెడ్డి, సీనియర్ అడ్వకేట్ హేమలత, ఆర్వీపీఎస్ రవి, విద్యార్థి నాయకుడు కోనేటి వెంకట్, బీఎస్‌పీ నాయకుడు అరుణ్ కుమార్, నౌషాద్, సి.బెలగల్ నాయకుడు వెంకటేష్, రైతు సంఘం నాయకుడు పులకుర్తి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరై సంఘీభావం ప్రకటించారు.

కేపీయస్ సభ్యులు,సి హెచ్, శ్రీనివాసులు,హరినాథ్ గౌడ్, డా.మధు, రైతులు, యువత, విద్యార్థులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply