AP | రాష్ట్రంలో క్రీడలకు పునర్ వైభవం…

  • ప్రజాప్రతినిధులకు క్రీడలు ఆటవిడుపు..
  • అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు…
  • ప్రజాప్రతినిధుల ఆటలతో కోలాహలంగా ఇందిరా గాంధీ స్టేడియం..

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండలి స‌భ్యులకు ఆట‌విడుపు క‌ల్పించాల‌నే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం క్రీడ‌లను ప్రారంభించిందని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్య‌న్న‌పాత్రుడు తెలిపారు.

శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండలి స‌భ్యుల క్రీడా పోటీలను విజ‌య‌వాడ‌ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో మంగళవారం మంత్రులు, ఉపసభాపతి కే. రఘురామ కృష్టం రాజుతో కలసి ప్రారంభించిన అనంతరం అయన మాట్లాడుతూ..

ప్రజాప్రతినిధులు రోజూ బిజీగా ఫోన్ మాట్లాడుకుంటారని, కనీసం ఈ 3 రోజులైనా మొబైల్ ఫోన్ ను పక్కన పెట్టి క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.

ప్రజాప్రతినిధులకు క్రీడలు కొత్త సంప్రదాయం కాదని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హ‌యాంలోనే ఎమ్మెల్యేల క్రీడ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కు క్రీడలన్నా, సాంస్కృతిక కార్యక్రమాలన్నా చాలా మక్కువన్నారు.

గత ప్రభుత్వ కాలంలో ప్రజాప్రతినిధుల క్రీడలు మరుగున పడిపోయాయన్నారు. ప్ర‌జాప్ర‌తినిధుల క్రీడ‌ల‌తో కోలాహ‌లంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మారిందన్నారు. మూడు రోజులపాటు ప్రజాప్రతినిధులు విధిగా క్రీడ‌ల్లో పాల్గొని విజ‌య‌వంతం చేయాలన్నారు.

రాష్ట్రంలో క్రీడ‌ల‌కు పూర్వ‌వైభ‌వం చేకూరేలా అందరూ సహకరించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణ రాజు మాట్లాడుతూ… ప్రజాప్రతినిధుల్లో కూడా ఎంతో మంది నేషనల్ ప్లేయర్స్ ఉన్నారన్నారు. విద్యార్దుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో కృషి చేయాలన్నారు. ప్ర‌స్తుత అసెంబ్లీ సెష‌న్‌లోనే క్రీడ‌లను నిర్వ‌హించ‌డం సంతోషంగా ఉందన్నారు.

క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్ర‌భుత్వం క్రీడా ప్రోత్సాహ‌కాలు పెంచి క్రీడ‌ల‌కు అత్యధిక ప్రోత్స‌హాం అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి అవకాశాలు వచ్చాయన్నారు.

క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తొలుత మంత్రులు, ఛీఫ్ విప్‌ల‌తో క‌లిసి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసిన స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ రాజు లు క్రీడా జ్యోతిని వెలిగించి మార్చ్‌ఫాస్ట్ ను క్రీడ‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ స‌భ్యులైన ఎమ్మెల్యేలు నిర్వహించారు.

మంగళవారం థ‌గ్ ఆఫ్ వార్ పోటీలో పాల్గొన్న మహిళ మంత్రులు తాడు లాగిన పోటీపడ్డారు. మంత్రి సంధ్యారాణి వెర్సెస్ మంత్రి అనిత టీమ్ పోటీలు థ‌గ్ ఆఫ్ వార్ లో సంధ్యారాణి టీమ్ గెలిచింది.

అదేవిధంగా థ‌గ్ ఆఫ్ వార్ లో మహిళా ప్రజాప్రతినిధులు వెర్సెస్ పురుష ప్రజాప్రతినిధుల పోటీలో మహిళలే గెలిచారు.. అదేవిధంగా ప్రజాప్రతినిధుల్లో సీఎం, స్పీకర్ టీములుగా క్రికెట్‌లో పోటీప‌డ్డారు.. వాలీబాల్, షటిల్ తదితర పోటీలు కూడా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *