చిత్తూరు (ఆంధ్రప్రభ బ్యూరో): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు మరో కొత్త ముందడుగు వేసింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ను ప్రారంభించనుంది. టెన్త్, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ అవార్డులు అందజేయనుంది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లా స్థాయిలో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈ నెల 9న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలియజేసింది.
అవార్డుల వివరాలు..
ఈ అవార్డులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల/జూనియర్ కళాశాలల విద్యార్థులకు వర్తిస్తాయి. విద్యార్థుల సాధనకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ ప్రోత్సాహక కార్యక్రమాన్ని అమలు చేయనుంది.
పదవ తరగతిలో 500 మార్కులు లేదా 83.33 శాతం, ఆపై మార్కుల సాధించిన విద్యార్థులకు మండలాల వారీగా అవార్డులను ఎంపిక చేసి ఆ అవార్డులను అందించనున్నారు.
ఇంటర్మీడియట్ లో 830 ఆపై మార్కుల సాధించిన విద్యార్థులను జిల్లాల వారీగా ఎంపిక చేసి అవార్డులను అందజేయనున్నారు. ప్రతి మండలంలో మొత్తం ఆరుగురు ఉత్తమ విద్యార్థులకు ఈ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ అవార్డుకు ఎంపికైన 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సర్టిఫికెట్ తో పాటు మెడల్, రూ.20,000 నగదు బహుమతిని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
మంత్రితో సమావేశం..
ఇప్పటికే ఉన్నత మార్కులతో మెరిసిన విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి రాష్ట్రస్థాయిలో టాపర్లు గా నిలచిన 52 మంది విద్యార్థులను విద్యాశాఖ మంత్రి నారాల్లో అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లోని సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.